కరెంటు ఖాతాల ద్వారానే ఎక్కువగా సైబర్ నేరాలు
హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక మీడియా సమావేశంలో కమిషనర్ సీవీ ఆనంద్
సైబర్ నేరాల వల్ల ఈ ఏడాది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ. 297 కోట్లు పోగొట్టుకున్నారని కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. పరువు పోతుందనే ఉద్దేశంతో చాలామంది ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... డయల్ 100కి వస్తున్న ఫిర్యాదుల సంఖ్య పెరిగిందన్నారు. ఫిర్యాదులు అందిన తర్వాత ఘటనాస్థలికి వెళ్తున్న సమయం బాగా తగ్గిందన్నారు. రాత్రిపూట పోలీసుల గస్తీ కూడా పెంచామన్నారు. సౌండ్ పొల్యుషన్‌పై తాము తీసుకున్న నిర్ణయాలకు ప్రజల నుంచి మద్దతు వస్తున్నదన్నారు. డీజేపీల సౌండ్‌పౌ అప్పుడప్పుడు ఇంకా కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 45 శాతం ఎఫ్‌ఐఆర్‌లు పెరిగినట్లు వివరించారు.
పెరిగిన ఫిర్యాదుల్లో చిన్నచిన్న చోరీలు, యాక్సిడెంట్ కేసులో ఉన్నాయి. గతంలో ఫిర్యాదులకు ఎఫ్‌ఐఆర్ నమోదు జరగకపోయేది. ఇప్పుడు ప్రతి చిన్న నేరానికి కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం వల్ల కేసుల సంఖ్య పెరిగింది. కిడ్నాప్ కేసుల్లో 85 శాతం పెరుగుదల నమోదైంది. మొబైల్ చోరీల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. సైబర్ నేరాల వల్ల డబ్బులు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ప్రజల్లో ఎంత అవగాహన కల్పించినా ప్రజలు మోసపోతున్నారని సీపీ తెలిపారు.
డిజిటల్ అరెస్టు అనగానే భయపడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. పెట్టుబడుల విషయంలోనూ మోసపోతున్నవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. గత ఏడాది కంటే 91 శాతం ఎక్కువ డబ్బు పోగొట్టుకున్నారు. కరెంటు ఖాతాల ద్వారా సైబర్ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎటువంటి విచారణ లేకుండానే కొందరికి బ్యాంక్ సిబ్బందికి కరెంటు ఖాతాలు ఇస్తున్నారు. కొందరు బ్యాంక్ సిబ్బంది కూడా సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారని సీవీ అనంద్ వివరించారు.
సంధ్య థియేటర్ ఘటనపై వీడియో విడుదల చేసిన సీపీ
పుష్ప2 మూవీ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ జరిగిన విషాద ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, దానిపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌పై అటు రాజకీయవర్గాల్లోనూ, ఇటు సినీవర్గాల్లో చర్చనీయాంశమైంది. .ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ దీనిపై స్పందించారు. సంధ్య థియేటర్ ఘటనపై వీడియో విడుదల చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదన్నారు. అల్లు అర్జున్ వద్దకు వెళ్లడానికి ఎస్‌హెచ్‌వో కూడా తీవ్రంగా కష్టపడాల్సి వచ్చిందన్నారు. అల్లు అర్జున్ వచ్చేందుకు థియేటర్ వాళ్లు దరఖాస్తు చేస్తే తిరస్కరించాం. థియేటర్ వాళ్లు అల్లు అర్జున్‌కు చెప్పారో.. లేదో తెలియదని సీపీ తెలిపారు.
స్టేషన్ హెడ్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) మాట్లాడుతూ.. థియేటర్‌కు వస్తున్నట్లు అల్లు అర్జున్ నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదన్నారు.అల్లు అర్జున్ మేనేజర్ వ్దదకు వెళ్లి తొక్కిసలాట విషయం చెప్పామని ఎస్‌హెచ్‌వో తెలిపారు. మహిళ చనిపోయింది. బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పాం. కానీ అల్లు అర్జున్ వద్దకు మేము వెళ్లడానికి మేనేజర్ ఒప్పుకోలేదన్నారు. డీసీపీ వెళ్లి చర్య తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అక్కడి నుంచి అల్లు అర్జున్ వెళ్లకపోతే పరిస్థితి చేయి దాటి పోతుందని చెప్పాం. సినిమా చూశాకే వెళ్తానని అల్లు అర్జున్ మాతో అన్నారు. ఎస్‌ఐ మాట్లాడుతూ.. రెండు థియేటర్లకు ఒకటే ఎగ్జిట్, ఎంట్రీ ఉన్నందున వద్దని చెప్పాం. తొక్కిసలాటలో నేనే పోతానని అనుకున్నాను.
ఒళ్లు దగ్గర పెట్టుకో.. తోలు తీస్తాం: ఏసీపీ వార్నింగ్
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ వ్యవహారం, పుష్సా-2 సినిమా విడుదల, తదనంతర పరిణామాల పై ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను పర్మిషన్ లేకుండా వెళ్లా అనేది పచ్చి అబద్ధమని పర్మిషన్ లేకుంటే పోలీసులే నన్ను తిరిగి పంపిస్తారు.. కానీ నేను థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్లే జనాన్ని క్లియర్ చేశారు అన్న అల్లు అర్జున్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
అల్లు అర్జున్ ఏమైనా తీస్ మార్ ఖాన్ అనుకుంటున్నాడా? అసలు ఆయనకు తెలంగాణలో ఆధార్ కార్డు ఉందా? పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు అంటున్నావు.. నీకు ఎందుకు చెప్పాలి నువ్వు ఏమన్నా తీస్ మార్ ఖాన్ అనుకుంటున్నావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు మామూలు పౌరుడివి.. నీకు ఆధార్ కార్డు ఆంధ్రలో ఉందా తెలంగాణలో ఎక్కడ ఉందో కూడా తెలియదని, ముందు అది తేలాన్నారు. అసెంబ్లీలో నీ వల్ల గంట సమయం పోయింది.. నీ గురించి మేము ఎందుకు బాధపడాలని ప్రశ్నించారు. లక్షల రూపాయల ప్రజల డబ్బుతో అసెంబ్లీలో చర్చలు జరుగుతుంటే నీ రామాయణం ఏందిరా బాబు అని ధ్వజమెత్తారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని లేకుంటే తోలు తీస్తామని హెచ్చరించారు.