Telugu Global
CRIME

సినీ నటుడు అల్లు అర్జున్‌ అరెస్ట్‌

సంధ్య థియేటర్‌ కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్న చిక్కడపల్లి పోలీసులు

సినీ నటుడు అల్లు అర్జున్‌ అరెస్ట్‌
X

సినీ నటుడు అల్లు అర్జున్‌ అరెస్టయ్యారు. సంధ్య థియేటర్‌ కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. పుష్ప2 బెనిఫిట్‌ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆయను అదుపులోకి తీసుకున్నారు. తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.ఈ కేసులో అల్లు అర్జున్‌ పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఆయనపై బీఎన్‌ఎస్‌ 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్‌ వెంట అల్లు అరవింద్‌, అల్లు శిరీష్‌ వెళ్లారు. నిన్న డిల్లీలో పుష్ప-2 సక్సెస్‌ మీట్‌ ముగించుకుని అల్లు అర్జున్‌ రాత్రి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఆయనను విచారిస్తున్నారు. అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం రిమాండ్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.సంధ్య థియేటర్‌ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు.మరో అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై అల్లు అర్జున్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. నన్ను తీసుకెళ్లడంలో తప్పులేదు. బట్టలు కూడా మార్చుకోనివ్వరా? ఇలా చేయడం మంచిది కాదన్నారు. పోలీసులు బెడ్‌ రూం వరకు వస్తారా? అని ప్రశ్నించారు.

పుష్ప-2 బెనిఫిట్‌ షో కోసం హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్దకు బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో వచ్చిన హీరో అల్లు అర్జున్‌ చూడటానికి అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో వారిని కట్టడి చేయడానికి పోలీసులు లాఠీఛార్జి చేయడంతో రేవతితో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పహ తప్పారు. పోలీసులు వారికి సీపీఆర్‌ చేసి స్థానిక ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రేవతి మృతి చెందింది. సంధ్యా థియేటర్‌ వద్ద తోపులాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆ బాలుడు కోలుకుంటున్నాడు.

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్‌లో రూపొందిన మూవీ 'పుష్ప2: ది రూల్‌' డిసెంబర్‌ 5న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 4న (బుధవారం) వివిధ ప్రాంతాల్లో ప్రీమియర్‌ షోలు ప్రదర్శించారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అక్షాంశ్‌ యాదవ్‌ వెల్లడించారు. 'బుధవారం రాత్రి 9.40 గంటలకు పుష్ప-2 ప్రీమియర్‌ షోను ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని సంధ్య థియేటర్‌లోనూ ఏర్పాటు చేశారు. దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అభిమానులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్‌కు వస్తారనే సమాచారం పోలీసులకు ఇవ్వలేదు. కనీసం థియేటర్‌ యాజమాన్యం కూడా మాకు సమాచారం ఇవ్వలేదు. సమాచారం ఇవ్వకపోగా.. యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. పబ్లిక్‌ను అదుపుచేయడానికి థియేటర్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి ప్రైవేట్‌ సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదు.

రాత్రి 9.40 గంటలకు వ్యక్తిగత భద్రతా సిబ్బందితో సంధ్య థియేటర్‌ వద్దకు అల్లు అర్జున్‌ వచ్చారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపుచేసే క్రమంలో నెట్టేయడం ప్రారంభించారు. అప్పటికే థియేటర్‌ లోపల, బయట ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి ఉండేది. ఈ క్రమంలో తోపులాట జరిగింది. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి కేటుంబం ఈ తొక్కిసలాటలో కిందపడిపోయారు. అధిక సంఖ్యలో అభిమానులు ఉండటంతో వారికి ఊపిరాడలేదు. వారిని గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే బైటికి లాగారు. రేవతి కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సీపీఆర్‌ చేసి దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. శ్రీతేజను మరో ఆస్పత్రికి తరలించాలని అక్కడి డాక్టర్లు సూచించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీసీ తెలిపారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

First Published:  13 Dec 2024 12:46 PM IST
Next Story