ఏపీలో డ్రగ్స్ కట్టడికి 'ఈగల్'
యాంటి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ కట్టడికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డ్రగ్స్ కట్టడిపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ బుధవారం సెక్రటేరియట్ లో సమావేశమైంది. హోం మంత్రి అనిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు నారా లోకేశ్, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, సంధ్యారాణి పాల్గొన్నారు. డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా యాంటి నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని, దానికి ఈగల్ అని పేరు పెడుతున్నామని మంత్రి అనిత తెలిపారు. అన్ని జిల్లాల్లో నార్కోటిక్ష్ కంట్రోల్ సెల్, పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 'ఈగల్ 1972' టోల్ ఫ్రీ నంబర్ ప్రారంభిస్తామన్నారు. ఈ టాస్క్ ఫోర్స్ ద్వారా గంజాయి సాగు, ట్రాన్స్‌పోర్ట్ పై గట్టి నిఘా పెడుతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్, గంజాయి ఆనవాళ్లు లేకుండా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. డ్రగ్స్ తో తలెత్తే అనర్థాలపై ప్రజలను చైతన్య పరుస్తామని, మహా సంకల్పం పేరుతో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. పోలీసులతో పాటు హెల్త్, ఫారెస్ట్, జీఏడీ శాఖలను సమన్వయం చేసుకుంటూ అన్ని జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఇందులో భాగస్వామ్యం చేస్తామన్నారు. ఆరు నెలల్లో గంజాయి వినియోగం లేకుండా చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తామని ప్రకటించారు.