ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటలో 18కి చేరిన మృతులు
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

ఢిల్లీ రైల్వే స్టేషన్ లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 18కి పెరిగింది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. మహాకుంభమేళాకు తరలివెళ్లే భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. ప్రయాగ్ రాజ్ కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు 14వ నంబర్ ప్లాట్ ఫాంపై ఉండటంతో అక్కడికి పెద్ద సంఖ్యలు చేరుకున్నారు. 12, 13 నంబర్ ప్లాట్ ఫాంలపైకి రావాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆలస్యం కావడంతో అప్పటికే వాటి కోసం వేచిచూస్తున్న ప్రయాణికులు ప్లాట్ ఫాంలపై ఉన్నారు. దీంతో ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ పెరిగి తొక్కిసలాట జరిగింది. తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం ప్రకటించింది. మృతుల్లో 9 మంది బిహార్, ఎనిమిది మంది ఢిల్లీ, హర్యానాకు చెందిన వారు ఒకరు ఉన్నారు.