ఎల్లారెడ్డి చెరువులో ఎస్సై, కానిస్టేబుల్ మృతదేహాలు
ఒకే చెరువులో ముగ్గురి మృతదేహాలు లభ్యం కావడంలో పలు అనుమానాలు
కామారెడ్డి జిల్లాలో ముగ్గురు అనుమానితంగా మృతి చెందిన ఘటన సంచలనం సృష్టించింది. అడ్లూరి ఎల్లారెడ్డి చెరువులో భిక్ననూరు ఎస్సై సాయికుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు లభ్యం కావడం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. విచారణ జరిపి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తామని జిల్లా ఎస్పీ సింధుశర్మ తెలిపారు.నిన్న మధ్యాహ్నం నుంచి భిక్ననూరు ఎస్ఐ సాయికుమార్ ఫోన్ స్విచాఫ్‌లో ఉన్నది. అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద ఎస్‌ఐ ఫోన్ సిగ్నల్ గుర్తించారు. పెద్ద చెరువు వద్ద ముగ్గురి ఫోన్లు, ఎస్ కారు, చెప్పులు గుర్తించారు. మూడో ఫోన్ బీబీ పేట సహకార బ్యాంకు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్‌దిగా గుర్తించారు. ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ముగ్గురి మృతదేహాలు ఒకే చెరువులో లభ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తున్నది. అర్ధరాత్రి మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. తెల్లవారుజాము వరకు ఎస్సై మృతదేహం కోసం గాలించగా.. దొరకలేదు. దీంతో గురువారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా.. ఎస్సై మృతదేహం దొరికింది. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి త తరలించారు. శృతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టు మార్టం తర్వాత ఎలా చనిపోయారు అన్నది తేలుతుంది. నిన్న సాయంత్రం నుంచి ముగ్గురు లేరనే సమాచారం వచ్చింది. ముగ్గురు ఒకే వెహికిల్ వచ్చారా? అని విలేకర్లు ప్రశ్నించగా.. ఇవన్నీ విచారణ లో తేలుతాయని, ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు.