ఇంట్లో బాణసంచా పేలి దంపతులు మృతి
ఇంట్లో బాణసంచా నిల్వలకు మంటలు అంటుకోవడంతో జరిగిన ప్రమాదం
యాకుత్‌పురాలోని ఓ ఇంట్లో బాణసంచా నిల్వలకు మంటలు అంటుకోవడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులతో పాటు కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో దంపతులు ఉషారాణి, మోహన్‌లాల్ చికిత్స పొందుతూ మృతి చెందారు.
స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. యాకుత్‌పురాలో మోహన్‌లాల్, ఉషారాణి దంపతులు బాణసంచా దుకాణం నిర్వహిస్తున్నారు. దుకాణం మూసివేయగానే అక్కడ ఉన్న బాణసంచాను తీసుకొచ్చి ఇంట్లో ఉంచారు. దీపావళి పండుగ నేపథ్యంలో పిండి వంటలు చేస్తున్న సమయంలో నిప్పు రవ్వలు బాణాసంచాపై పడటంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.మంటలు ఇల్లంతా వ్యాపించి క్షణాల్లోనే మొత్తం దగ్ధమైంది. మోహన్‌లాల్, ఉషారాణి, వారి కుమార్తె పొగ పీల్చడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారి ముగ్గురిని తరలించగా.. చికిత్స పొందుతూ దంపతులు దుర్మరణం చెందారు. ప్రస్తుతం వారి 18 ఏళ్ల కుమార్తె మలక్‌పేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. అయితే పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు అనేకసార్లు విక్రేతలు జాగ్రత్తలు తీసుకుని, నిబంధనలు పాటించాలని చెబుతున్నప్పటికీ దుకాణ వ్యాపారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.