మహాకుంభమేళాలో అపశృతి: 20 మందికి పైగా మృతి
ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం
ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకున్నది. తొక్కిసలాటలో 20 మందికి పైగా భక్తులు చనిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. బాధితులను సమీప ఆస్పత్రులకు అంబులెన్సుల్లో తరలించారు. ప్రయాగ్‌రాజ్‌లో సెక్టర్ 2 ప్రాంతంలో ఈ తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించడానికి త్రివేణి సంగమం వద్దకు భక్తులో పోటెత్తారు. భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. భక్తుల తాకిడికి బారికేడ్లు విరిగిపోయాయి.
నేడు 10 కోట్ల మంది తరలివచ్చే అవకాశం
జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాలో ఇప్పటివరకు 15 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయగా.. నేడు ఒక్కరోజే 10 కోట్ల మంది తరలివచ్చే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే ప్రయాగ్‌రాజ్‌కు 5 కోట్ల మంది చేరుకున్నట్లు తెలుస్తోంది.
సగం సగం పనుల వల్లనే తొక్కిసలాట: కాంగ్రెస్
తొక్కిసలాటపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. సగం సగం పనుల వల్లనే కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. యోగి ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయలేదని హస్తం పార్టీ విమర్శించింది. కుంభమేళా నిర్వహణ నుంచి ఆదిత్యనాథ్ ను తప్పించాలని, వీవీఐపీల రాకపోకలను నియంత్రించాలని డిమాండ్ చేసింది. తొక్కిసలాటలో భక్తుల మరణాలు, గాయపడిన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. రూ. కోట్లు ఖర్చు పెట్టినా అంతంత మాత్రంగానే ఉన్నాయని విమర్శించారు.
ఎలాంటి వదంతులు ప్రచారం చేయవద్దు: యూపీ సీఎం
మౌని అమావాస్య సందర్భంగా భక్తుల తాకిడి పెరిగిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు. రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎలాంటి వదంతులు ప్రచారం చేయవద్దని సీఎం కోరారు. స్నాన ఘట్టాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కొంతమంది బారికేడ్లను తోసుకుంటూ వచ్చారు. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించామని సీఎం తెలిపారు.