తిరుపతి హత్యాచార ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్
నిందితులపై కఠిన చర్యలకు ఆదేశం
తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో చిన్నారిపై హత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నది. ఘటనాస్థలాన్ని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, పుత్తూరు డీఎస్పీ రవికుమార్‌లు పరిశీలించారు.
తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడేళ్ల బాలికపై హత్యాచారం ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. చిన్నారి కుటుంబానికి రూ. 10 లక్షలు అందజేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం బాధిత కుటుంబానికి హోం మంత్రి అనిత దీనికి సంబంధించిన చెక్కును అందజేయనున్నారు.
ఈ ఘటనపై హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపి దారుణానికి పాల్పడటం హేయమన్నారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు.ఈ ఘటనపై సత్వరమే విచారణ జరిపి నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని అనిత తెలిపారు.