సుప్రీం కోర్టులో వైఎస్ జగన్ కు బిగ్ రిలీఫ్
రఘురామ పిటిషన్ డిస్మిస్ చేసిన అత్యున్నత న్యాయస్థానం
సుప్రీం కోర్టులో వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. మరో పిటిషన్ ను తానే విత్ డ్రా చేసుకుంటానని రఘురామ కృష్ణంరాజు సుప్రీం కోర్టును అభ్యర్థించారు. ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత జగన్ ను ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నాల్లో కూటమి ప్రభుత్వం ఉంది. ఈక్రమంలో జగన్ బెయిల్ ను రద్దు చేయడంతో పాటు ఆయన కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సోమవారం జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం విచారించింది. జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఏముందని పిటిషనర్ ను ప్రశ్నించింది. జగన్ కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం ఏమిటో చెప్పాలని ప్రశ్నించింది. జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ఒక పిటిషన్ ను డిస్మిస్ చేసింది. మరో పిటిషన్ పై వివరణ కోరుతుండగా పిటిషనర్ తరపు అడ్వొకేట్ దానిని ఉపసంహరించుకుంటామని అప్పీల్ చేశారు. దానికి ధర్మాసనం సమ్మతించింది. మొత్తంగా రఘురామ రాజకీయ కారణాలతో వేసిన రెండు పిటిషన్లను సుప్రీం కోర్టు తోసిపుచ్చడంతో జగన్ కు భారీ ఊరట లభించింది.