అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మలయాళ నటుడు సిద్ధిఖీని పోలీసులు అరెస్టు చేశారు. అయితే గంటల వ్యవధిలోనే ఆయనకు బెయిల్ రావడం విశేషం. ఈ కేసు విచారణ కోసం శుక్రవారం ఆయన దర్యాప్తు సంస్థ ముందు హాజరయ్యారు. ఈ క్రమంలోనే నటుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మెడికల్ టెస్టులు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ ఆయనకు బెయిల్ లభించడంతో సిద్ధిఖీ విడుదలయ్యారు. నవంబర్‌లో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ గడువు ముగియడంతో సిద్ధిఖీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్ట్ సినిమా ఇండస్ట్రీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
మలయాళ సినిమా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక ఆ పరిశ్రమను కదిపేస్తున్నది. అక్కడి దర్శక-నిర్మాతలను ఉద్దేశించి పలువురు నటీమణులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు, నిర్మాత సిద్ధిఖీపై నటి రేవతి సంపత్ తీవ్ర ఆరోపణలు చేశారు. 2016లో తిరువనంతపురంలోని ప్రభుత్వ హోటల్‌లో సిద్ధిఖీ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఇటీవల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు తనపై రేవతి చేసిన ఆరోపణలపై సిద్ధిఖీ డిజీపీకి ఫిర్యాదు చేశారు. ఆమె కావాలనే తన పరువు, మర్యాదలకు భంగం కలిగిస్తున్నారని అన్నారు. ఈ మేరకు ఆమె కుట్రలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే ఆమె ఎన్నో సందర్భాల్లో ఇలాంటి ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అయితే రేవతి ఆరోపణల దృష్ట్యా సిద్ధిఖీ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. కేరళ హైకోర్టు దీనికి నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ ముందస్తు బెయిల్ మంజూరైంది.