Telugu Global
CRIME

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

భాస్కర్ రెడ్డి క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన ఏపీ ఉన్నత న్యాయస్థానం

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు
X

వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గతంలో బాలికపై అత్యాచారం జరిగిందని అసత్య ప్రచారం చేశారని ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు తిరుపతి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో తాజాగా శుక్రవారం కోర్టు చెవిరెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది.

కేసు ఏమిటంటే?

తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన బాలికపై అత్యాచారం జరిగిందని వ్యాఖ్యానించడంతో పాటు సోషల్‌ మీడియాలో ప్రసారం చేశారన్న ఆరోపణలతో చెవిరెడ్డిపై కేసు నమోదైంది. వాస్తవాలు నిర్ధారించుకోకుండా అసత్య ప్రచారం చేయడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోక్సో కేసు పెట్టారు.

యర్రావారిపాలెం మండలానికి చెందిన బాలిక స్కూల్‌ నుంచి ఇంటికి వస్తుండగా ముసుగు వేసుకున్న దుండగులు తనపై దాడి చేసి మత్తు మందు తాగించారని తల్లిదండ్రులను నమ్మించింది. ఘటన పూర్వాపరాలు తెలుసుకోకుండా, వాస్తవాలు నిర్ధారించుకోకుండానే బాలిక చదివే స్కూల్‌కు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆమెపై అత్యాచారం జరిగిందని, ఆమెకు అండగా ఉంటామని వ్యాఖ్యానించినట్లు పోలీసులు గుర్తించారు. బాలికకు వైద్య పరీక్షలు చేసి అత్యాచారం జరగలేదని పోలీసులు చెప్పినా, సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేసినట్లు తేల్చారు. ఈ కేసులో బాధితురాలు బాలిక కావడంతో ఆమెతోపాటు కుటుంబసభ్యుల గుర్తింపు ప్రచారం చేయడం పోక్సో చట్టం ప్రకారం ఉల్లంఘన అవుతుంది. అసత్య ప్రచారం చేసి తమను మనోవేదనకు గురిచేశారంటూ బాలిక తండ్రి చెవిరెడ్డిపై ఫిర్యాదు చేశారు.

First Published:  10 Jan 2025 11:45 AM IST
Next Story