రణ్‌వీర్ తదితరులపై మరో కేసు
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌పై ఇప్పటికీ ముంబయి, అసోంలోని గుహవాటిలో కేసులు నమోదు కాగా.. తాజాగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో మూడో ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్

'ఇండియాస్ గాట్ లాటెంట్' షోలో ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా తదితరులపై మరో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో ఇప్పటికీ ముంబయి, అసోంలోని గుహవాటిలో కేసులు నమోదు కాగా.. తాజాగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో మూడో ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ అయ్యింది. జై రాజ్‌పుతాన సంఘ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. సమయ్ రైనా, ఆశీశ్ చంచలానీ, అపూర్వ మఖీజా తదిరుల పేర్లు ఇందులో చేర్చారు. అనంతరం కేసును ముంబయిలోని ఖార్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఖార్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వ్యవహారంలో వాంగ్మూలం నమోదు కోసం ఫిబ్రవరి 24న తమ ముందు హాజరుకావాలంటూ రణ్‌వీర్ అల్హాబాదియాకు మహారాష్ట్ర సైబర్ విభాగం సమన్లు జారీ చేసింది. ఇదివరకు ఓసారి నోటీసులు ఇచ్చినప్పటికీ..అతను గైర్హాజరయ్యాడు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చింది. సమయ్ రైనానూ ఈ నెల 18న హాజరు కావాలంటూ సమాచారం అందించింది. వర్చువల్ విధానంలో స్టేట్‌మెంట్ రికార్డు చేయాలన్న అతని విజ్ఞప్తిని తోసిపుచ్చింది. అసోం పోలీసులు కూడా ఇప్పటికే ముంబయికి వచ్చి.. నిందితులకు నోటీసులు జారీ చేశారు. గుహవాటిలో స్వయంగా హాజరుకావాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఇవాళ మధ్యాహ్నం విచారణకరు కావాలంటూ రణ్‌వీర్, సమయ్ రైనా తదితరులకు జాతీయ మహిళా కమిషన్ ఇది వరకే నోటీసులు జారీ చేయగా.. ఎవరూ రాలేదు. వ్యక్తిగత భద్రత, ముందుగా ప్లాన్ చేసిన ప్రోగ్రామ్స్ తదితర కారణాలను ప్రస్తావించినట్లు సమాచారం. హత్య బెదిరింపులు వస్తున్నాయని చెబుతూ.. విచారణను మూడు వారాల పాటు వాయిదా వేయాలని రణ్‌వీర్ విజ్ఞప్తి చేయగా మార్చి 6కు రీషెడ్యూల్ చేసింది. చంచలానీ, మఖీజాలతో పాటు మరో ఇద్దరినీ అదే రోజు రావాలని సూచించింది. ప్రస్తుతం అమెరికాప ర్యటనలో ఉన్న సమయ్ రైనాతో పాటు మరొకరి విచారణ తేదీని మార్చి 11గా ఖరారు చేసింది.