అన్నా వర్సిటీ ఘటన..నిందితుడి గురించి విస్తుపోయే విషయాలు
జ్ఞానశేఖరన్ ఇండ్లలోకి వెళ్లి దొంగతనం చేయడం, ప్రేమికులను బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
అన్నా వర్సిటీ అత్యాచార ఘటనలో అరెస్టైన జ్ఞానశేఖరన్ ఇండ్లలోకి వెళ్లి దొంగతనం చేయడం, ప్రేమికులను బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అలాగే అతని సెల్ ఫోన్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. అన్నావర్సిటీ విద్యార్థిని అత్యాచారం ఘటనను హైకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తున్నది. ఈ బృందం తొలి విడతగా అన్నా వర్సిటీలోని ఘటనాస్థలికి, సీసీ టీవీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో పరిశీలించి వివరాలను సేకరించింది. ఈ నేపథ్యంలో నిందితుడు జ్ఞానశేఖరన్ గురించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడేవాడని, అదేవిధంగా ఇండ్లలో ఒంటరిగా ఉన్న మహిళలను బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడి, వీడియో తీసేవాడని తెలిసింది. అతనిపై పళ్లికరణై, అమింజకరై, మైలాపూర్ మొదలైన పీఎస్‌లలో చోరీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పళ్లికరణైలో జరిగిన చోరీ కేసులో పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న స్థితిలో అన్నా వర్సిటీ కేసులోఅరెస్టయ్యాడు. అంతగాకుండా ఏకాంతంగా ఉన్న ప్రేమికులను బెదిరించి యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడని తేలింది. ఈ క్రమంలో సైబర్ క్రైం పోలీసులు అతను వినియోగించిన రెండు సెల్‌ఫోన్‌లను పరిశీలిస్తున్నారు.