హైదరాబాద్ లో నటి కస్తూరి అరెస్ట్
గచ్చిబౌలిలో అదుపులోకి తీసుకున్న తమిళనాడు పోలీసులు
ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు కస్తూరిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. తెలుగువారిపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన ఆమెపై తమిళనాడులోకి పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆమె మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ను ఆశ్రయించారు. కస్తూరి ముందస్తు బెయిల్ పిటిషన్ ను మధురై బెంచ్ తిరస్కరించడంతో ఆమె అరెస్ట్ ఖాయం అయ్యింది. కొన్ని రోజులుగా ఆమె తప్పించుకొని తిరుగుతున్నారు. గచ్చిబౌలిలో ఆమె ఉన్నారనే సమాచారంతో తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకొని చెన్నైకి తరలిస్తున్నారు. తెలుగు వాళ్లు తమిళుల అంతఃపురంలో దాసీ పనిచేయడానికే తమిళనాడుకు వచ్చారని ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తెలుగు వాళ్లందరినీ ఉద్దేశించి తాను వ్యాఖ్యలు చేయలేదని ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్, మాజీ సీఎం కరుణానిధి వాళ్ల కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కస్తూరి కామెంట్స్ పై డీఎంకే నాయకులు, పలువురు తెలుగువాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కస్తూరి అరెస్ట్ ను తమిళనాడు పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.