Telugu Global
CRIME

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం

నలుగురు అరెస్ట్‌.. నిందితులను రేపు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం
X

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సీబీఐ చేపట్టిన విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం.. నెయ్యి సరఫరా చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నది. తమిళనాడుకు చెందిన ఏఆర్‌ డెయిరీ, యూపీకి చెందిన పరాగ్‌ డెయిరీ, ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌, ఆల్ఫా మిల్క్‌ ఫుడ్స్‌ సంస్థలకు సంబంధించి కీలక వ్యక్తులను మూడు రోజులుగా తిరుపతిలో విచారిస్తున్నది. విచారణకు సహకరించకపోవడంతో పాటు కల్తీ నెయ్యి ఘటనలో వారి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఆదివారం అదుపులోకి తీసుకున్నది. నిందితులను సోమవారం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది.

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగంపై సీబీఐ నేతృత్వంలో సాగుతున్న దర్యాప్తు కీలక దశకు చేరింది. శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతు కళేబరాల అవశేషాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మారిన వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ కోరుతూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలోని పూర్తిస్థాయి విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది.

First Published:  9 Feb 2025 11:25 PM IST
Next Story