Telugu Global
CRIME

కలకలం సృష్టిస్తున్న 145 కోతుల మృతి

యూపీలోని హాథ్రస్‌లో ఎఫ్‌సీఐ గోదాంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై సర్వత్రా ఆందోళన

కలకలం సృష్టిస్తున్న 145 కోతుల మృతి
X

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో వెలుగుచూసిన కోతుల మృతి ఘటన కలకలం సృష్టిస్తున్నది. ఎఫ్‌సీఐ గోదాంలో 145 కోతులు ప్రాణాలు కోల్పోయాయి. ఆ విషయం బైటికి పొక్కకుండా అక్కడే వాటిని పూడ్చిపెట్టారు. ఆలస్యంగా బైటికి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక నేత హర్షిత్‌ గౌర్‌ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు తెలిసిన వ్యక్తి ఒకరు ఎఫ్‌సీఐ గోదాంలో పనిచేస్తున్నారని, కోతులను పాతిపెట్టిన విషయం ఆ ఉద్యోగి వల్లనే తనకు తెలిసిందన్నారు. నవంబర్‌ 9న ఆహారధాన్యాలకు చీడపీడలు రాకుండా రసాయనాలు పిచికారీ చేసిన తర్వాత ఆ కోతులు గోదాంలోకి ప్రవేశించి చనిపోయాయని ఆ ఉద్యోగి ద్వారా తెలిసిందని అన్నారు. దీనిపై వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చానని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే ఉద్యోగులు ఆ విషయాన్ని బైటికి చెప్పలేదని ఫిర్యాదులో ఆరోపించారు.

కొత్వాలి స్టేషన్‌ హౌస్‌ అధికారి విజయ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఈ ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నామన్నారు. జీవహింస వ్యతిరేక చట్టంలోని నిబంధనల కింద వారిపై కేసు నమోదు చేశామన్నారు. ఈ స్థాయిలో కోతుల మృతి వెనుక గల కారణాలను తెలుసుకోవడానికి వెటర్నరీ డాక్టర్లను రప్పించామన్నారు.

First Published:  22 Nov 2024 5:07 PM IST
Next Story