Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Saturday, September 20
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Cinema & Entertainment

    Martin Luther King Movie Review | మార్టిన్ లూథర్ కింగ్ మూవీ రివ్యూ {2.5/5}

    By Telugu GlobalOctober 28, 20237 Mins Read
    Martin Luther King Movie Review | మార్టిన్ లూథర్ కింగ్ మూవీ రివ్యూ {2.5/5}
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    చిత్రం : మార్టిన్ లూథర్ కింగ్

    దర్శకత్వం : పూజా కొల్లూరు

    తారాగణం : సంపూర్ణేష్ బాబు, నరేష్, వెంకటేష్ మహా, శరణ్యా ప్రదీప్ తదితరులు

    రచన : వెంకటేష్ మహా, సంగీతం : స్మరణ్ సాయి, ఛాయాగ్రహణం : వై. దీపక్

    నిర్మాతలు : ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర

    విడుదల : అక్టోబర్ 27, 2023

    రేటింగ్ : 2.5/5

    ఏడాది కొక సినిమా నటించే చిన్న సినిమాల తెలంగాణ హీరో సంపూర్ణేష్ బాబుకి సక్సెస్ లు తక్కువే. 2014 లో ‘హృదయ కాలేయం’ అనే కామెడీతో నటుడయ్యాక కాలక్షేప కామెడీలే చేసుకొస్తూ ఇప్పుడు వాస్తవిక కథా చిత్రంగా రాజకీయ సెటైర్ ప్రయత్నించాడు. దీనికి పూజా కొల్లూరు కొత్త దర్శకురాలు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు కూడా చూసి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం గురించి తెలియజెప్పే ఈ ‘మార్టిన్ లూథర్ కింగ్’ ఎలా వుందో తెలుసుకుందాం…

    కథ

    పడమర పాడు అనే గ్రామంలో అమాయకుడైన స్మైల్ (సంపూర్ణేష్ బాబు) చెప్పులు కుట్టి జీవిస్తూంటాడు. అతను ఒంటరి, మర్రి చెట్టు అతడి నివాసం. గ్రామంలో ఎవరు ఏ పని చెప్పినా పెంపుడు జంతువులా చేస్తూ ఆ వచ్చే డబ్బుల్ని దాస్తూంటాడు. డబ్బులు కూడబెట్టి చెప్పుల షాపు తెరవాలని అతడి కల. ఆ డబ్బు ఎవరో కొట్టేస్తారు. ఇలాకాదని, డబ్బు పోస్టాఫీసులో దాయాలని, స్నేహితుడు పోస్టాఫీసులో ఖాతా తెరిపించడానికి తీసుకుపోతాడు. కొత్త పోస్టు మాస్టర్ వసంత (శరణ్యా ప్రదీప్) ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అడుగుతుంది. అవి లేవు. తల్లిదండ్రులేం పేరు పెట్టారో గుర్తు లేదు. వూళ్ళో నోటికొచ్చిన తిట్టుతో తనని పిలుస్తోంటే అసలు పేరు మర్చిపోయాడు. చూస్తే చిరునవ్వుతో వున్నట్టు కన్పిస్తాడు కాబట్టి, కొందరు స్మైల్ అని పిలవడం మొదలెట్టారు. పేరే లేకపోతే ఐడీ కార్డు కూడా రాదు. అందుకని వసంత బాగా ఆలోచించి, అతడికి మార్టిన్ లూథర్ కింగ్ అని పేరు పెట్టేస్తుంది. వెళ్ళి ఆ పేరుతో ఆధార్ కార్డు తెచ్చుకోమంటుంది. అలా ఖాతా ఓపెన్ అవుతుంది. ఇంకా ఈ దిక్కుమాలిన వాడికి ఆధార్ కార్డు ఆధారంగా ఓటర్ ఐడీ కార్డు కూడా రావడంతో గ్రామంలో సంచలనం రేగుతుంది.

    ఇలా వుండగా, పంచాయితీ ఎన్నికలు దగ్గర పడతాయి. గ్రామాన్ని ఉత్తర కులం, దక్షిణ కులంగా ఆక్రమించుకుని పెత్తనాలు చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములుంటారు. వీళ్ళ తల్లుల కులాలు వేర్వేరు. తండ్రి ఒక్కడే. కాబట్టి సవతులైన తల్లుల కులాల కారణంగా అన్నదమ్ములకి ఒకరంటే ఒకరికి పడక, గ్రామాన్ని కుల ఘర్షణలతో అట్టుడికిస్తూంటారు. ఉత్తరం దిక్కుకి జగ్గు (నరేష్), దక్షిణం దిక్కుకి లోకి (వెంకటేష్ మహా) కులోన్మాదులుగా పేర్గాంచి వుంటారు.

    అయితే పంచాయితీ ఎన్నికలు రావడంతో ఓట్ల లెక్క తీస్తే, ఇద్దరికీ సమానంగా ఓట్లు పడతాయని తెలుస్తుంది. జనాలు కులోన్మాదం పెంచుకోవడంతో ఎదుటి కులం ఓట్లు కొనలేని పరిస్థితి. అలాంటప్పుడు ఎదుటి కులం ఓట్లు తగ్గించాలంటే కొన్ని శాల్తీల్ని లేపెయ్యాలని హత్యాయత్నాలు కూడా చేస్తారు. ఇంతలో కొత్తగా ఓటు హక్కు పొంది, మార్టిన్ లూథర్ కింగ్ గా తిరుగుతున్న స్మైల్ దృష్టిలో పడతాడు. దీంతో అతడి ఓటు కొట్టేసి ఒక ఓటు మెజారిటీతో సర్పంచ్ గా గెలవచ్చని అతడ్ని పట్టుకుంటారు.

    దీంతో మార్టిన్ వీఐపీ అయిపోతాడు. అతడి ఓటు కోసం పోటీపడుతూ అన్నదమ్ములు అతడ్ని అందలా లెక్కించడమే గాక, తొక్కేస్తారు కూడా ఎవరికి వేస్తాడో చెప్పలేక పోతూంటే. ఇలా ఈ దుష్ట సోదరుల మధ్య చిక్కుకున్న మార్టిన్, తను పొందిన ఏకైక ప్రజాస్వామిక హక్కుతో ఏ నిర్ణయం తీసుకున్నాడు? దీనికి ఎన్ని ప్రమాదాలేదుర్కొన్నాడు? చివరికి తన ఓటు హక్కుతో వ్యూహాత్మకంగా, ప్రత్యర్ధులు దిమ్మెరబోయేలా మాస్టర్ స్ట్రోక్ ఎలా ఇచ్చాడు? ఇదీ మిగతా కథ.

    ఎలావుంది కథ

    సరీగ్గా ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈ కీలక ఎన్నికల సినిమా విడుదలైంది. ఇలాగే సరీగ్గా 2021 ఏప్రెల్ లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకి ముందు రోజు తమిళంలో దీని మాతృక విడుదలైంది. తమిళంలో టాప్ కమెడియన్ యోగిబాబు నటించిన ‘మండేలా’ కి రీమేక్ ‘మార్టిన్ లూథర్ కింగ్’. ‘మండేలా’ కి జాతీయ స్థాయిలో మంచి పేరొచ్చింది. 2021 తమిళ నాడు పోలింగ్ కి ముందు రోజు విడుదలైన ‘మండేలా’ లో, ఓటుకి నోటు, తాయిలం, కులం, మతం కాదని స్వచ్ఛంగా ఓటేస్తూ, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే నయా ఓటింగ్ మోడల్ చూపిస్తే, ఇది అక్కడ పోలింగ్ రోజున ఎంత వరకూ ప్రభావితం చేసిందో తెలీదు.

    ఓటింగ్ పరంగా ఒక వినూత్న ఐడియాతో తమిళంలో ‘మండేలా’ వాస్తవిక సినిమాని కొత్త దర్శకుడు మడోన్ అశ్విన్ ప్రయోగాత్మకంగా తీశాడు (2023 లో శివకార్తికేయన్ తో నూరు కోట్లు వసూలు చేసిన ‘మావీరన్’ తీశాడు). ఎన్నికల్లో కుల మతాలు, డబ్బూ బహుమతులూ ఎరగా వేసి ఓట్లు కొల్లగొట్టుకునే కన్స్యూమరిజం రాజకీయం కొత్తదేం కాదు. ఓటర్లంటే ఫ్రీబీ (రేవడీ) లకి ఆశపడే కస్టమర్లు. వీరి కోసం టీవీలు, కరెంటు, లాప్ టాప్ లు, టాబ్లెట్లు, స్కూటీలు, గ్యాస్ బండలు, నెల ఖర్చులకి డబ్బులు… ఇలా ఎన్నో బహుమతులు ఇస్తామని పార్టీలు పోటీలు పడి ప్రకటిస్తున్నాయి. రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అయితే కిలో ఆవుపేడ రెండు రూపాయలకి కొంటామని కూడా ప్రకటించింది!

    ఇక కుల మత భావాలు రెచ్చగొట్టడం సపరేట్ సెక్షన్. దీనికి పార్టీలు సొంతంగా పెట్టుకునే ఖర్చుంటుంది. ప్రస్తుత ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్కో ర్యాలీ నిర్వహణకి పది కోట్లు ఖర్చు పెడుతున్నాయి పార్టీలు. ఈ ఎన్నికల ప్రచార వ్యయం అన్ని పార్టీలకీ కలిపి లెక్కకడితే, ఈ ఖర్చుతో ఒక ఏడాది పాటు దేశ ప్రజలకి రేషన్ సరఫరా చేయ వచ్చు ప్లస్ దేశవ్యాఫంగా బడి పిల్లలకి ఏడాది పాటు మధ్యాహ్న భోజన పథకం ఇవ్వొచ్చు ప్లస్ దేశవ్యాప్తంగా పేదలకి ఏడాది పాటు ఉపాధి హామీ పథకం నిర్వహించ వచ్చు…ఈ మూడు పథకాలకి ప్రభుత్వాల దగ్గర మాత్రం డబ్బులేదు, వుండదు.

    కానీ ఎన్నికల కోసం పార్టీల దగ్గర మాత్రం ఈ మూడు పథకాలకి సరిపడా డబ్బుంటుంది. 2023 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో 121 దేశాల్లో ఇండియా 107 వ స్థానానికి దిగజారి ఆకలి రాజ్యంగా అలమటిస్తోంది. పార్టీలు మాత్రం అపర కుబేర పార్టీలుగా ఎదిగాయి. ప్రభుత్వం పేదది, ప్రజలు నిరు పేదలు, పార్టీలు మాత్రం అల్ట్రా రిచ్. ఎన్నికల్లో పార్టీల హోరాహోరీ పోరాటాలన్నీ ప్రభుత్వ ఖజానా మీద కబ్జా కోసమే తప్ప మరేం కాదు.

    ప్రభుత్వ ఖజానా లోంచి మీరిచ్చే బహుమతులు కాదు, మేం ఓటేయాలంటే ముందు మౌలిక సదుపాయాలు కల్పించండని గ్రామాలు ఎదురు బేరం పెడితే, ర్యాలీలు జరగవు. ఆ ర్యాలీల ఖర్చుతో గ్రామాలు బాగుపడతాయి. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కొరత నెదుర్కొంటున్నది గ్రామీణులే. ఇదే ఈ కథలో చూపించారు. అయితే సినిమా కథ కాబట్టి గేమ్ గా చూపించి రక్తి కట్టించాలనుకున్నారు. మండేలా/మార్టిన్ దగ్గరున్న విలువైన ఓటు కోసం ప్రత్యర్ధులైన అన్నదమ్ములు దిగివచ్చి, గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించింతర్వాత, గ్రామప్రజలు ఓటెయ్యకుండా మొండి చేయి చూపడమన్నది కాస్త అన్యాయమే. అయితే పార్టీల్ని ఇలా డబుల్ క్రాస్ చేస్తే తప్ప ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ ప్రజా పాలన చెయ్యవేమో అనేది కూడా ఆలోచించాలి. ఇదే ఈ సినిమా రసవత్తరంగా చేస్తున్న పని.

    నటనలు- సాంకేతికాలు

    యోగిబాబుతో పోల్చనవసరం లేదుగానీ సంపూర్ణేష్ బాబు చెప్పులు కుట్టే వాడిగా పాత్ర స్వభావానికి సరిపోయాడు. తమిళంలో యోగిబాబుది క్షురకుడి పాత్ర. అయితే తమిళంలో పేరు పాత్రకి తగ్గట్టుగా వుంది. అది కులవివక్ష అనుభవించే పాత్ర కాబట్టి మండేలా పేరుపెట్టాడు తమిళ దర్శకుడు. నెల్సన్ మండేలా వర్ణవివక్ష గురించి పోరాడేడు. తెలుగులోనూ కుల వివక్ష అనుభవించే సంపూర్ణేష్ బాబు పాత్రకి మార్టిన్ లూథర్ కింగ్ పేరు పెట్టారు. కానీ మార్టిన్ లూథర్ కింగ్ పోరాడింది మానవ హక్కుల గురించి. కొత్త దర్శకురాలు ఈ తేడా గమనించకుండా ‘మార్టిన్ లూథర్ కింగ్’ టైటిల్ గా కూడా పెట్టేసినట్టుంది.

    వెర్రి బాగుల వాడు వెళ్ళి వెళ్ళి ఓటు హక్కుతో ఎన్నికల్లో ప్రత్యర్ధులకి చిక్కి కింగ్ అయిపోవడం, వాళ్ళ కుమ్ములాటలో తన స్థానమేమిటో క్లెయిమ్ చేసుకుని పాగా వేయడం సంపూర్ణేష్ పాత్ర పని. ఈ రూపాంతరానికి ఆధారం పాత్రచిత్రణే. పైకి కింగ్ గా దర్జా వెలగబెట్టినా, లోలోపల అతను వాస్తవం తెలిసిన వాడే. చెప్పుల షాపు పెట్టి తండ్రి కోరికని నిజం చేయాలన్న కలలున్నప్పుడు అశాంతిని తెచ్చుకోకూడదన్న అర్ధంలో పాత్ర తీరు. అందుకే వూళ్ళో తనని ఎంత తక్కువ కులం వాడిగా చూసినా, కించపర్చినా, కిమ్మనక శాంతంగా కల కోసం పని చేసుకు పోతాడు.

    కుల, మత, ప్రాంతీయ తత్వాలు భూమ్మీద మనుషులున్నంత కాలం వుండేవే. ఇవి తొక్కే స్తున్నాయని కులం కార్డో, మతం కార్డో, ప్రాంతీయ కార్డో ప్రయోగించి వీధికెక్కితే ప్రయోజనం లేదు. అప్పుడా కార్డూ వుండదు, సొంత కలలూ వుండవు. ఈ ఆటంకాల మధ్య నుంచి దారి చేసుకుంటూ కలల సాఫల్యతకి కృషి చేసుకు పోవడమే మార్గం. ఇది పాత్రగా సంపూర్ణేష్ నేర్పుతాడు. ఇందుకే అణిగి మణిగి వుండే క్యారక్టర్ గా కన్పించడం. వూళ్ళో అగ్రకులాల పట్ల ఎంత జాగ్రత్తగా వుంటాడంటే, పోస్ట్ మాస్టర్ వసంత మార్టిన్ లూథర్ కింగ్ అని పేరు పెడితే, అది అగ్రకులం పేరేమోనని భయపడతాడు.

    తన నిమ్న కుల ఆత్మ న్యూనతా భావాన్ని మర్చిపోవడానికి, మర్రి చెట్టుకి పైన ఉయ్యాల కట్టుకుని, ఉయ్యాల్లో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో తను పైన స్వర్గంలో వున్నట్టు ఫీలవుతూ, కమ్మగా నిద్రపోతాడు. తన నిమ్న కుల స్థానంతో ఎంత విధేయంగా వుంటాడంటే, పోస్టాఫీసు కెళ్ళి పక్క గోడ చూస్తూ, వెనుక గుమ్మం లేదే అనుకుంటాడు. ఇళ్ళల్లోకి వెనుక గుమ్మంలోంచి వెళ్ళాలి కాబట్టి ఇక్కడా అదే అనుకుంటాడు.

    పోస్టాఫీసులోకి వెళ్తూంటే తలుపు వూడి పడుతుంది. ఇక్కడ డబ్బులు దాస్తే వుంటాయా అని భయపడతాడు. డబ్బులు జమచేసి వెళ్తూ తలుపు గట్టిదనాన్ని మళ్ళీ పరీక్షిస్తాడు. ఈ చర్యలు పాత్ర తీరు రీత్యా హాస్యం పుట్టించినా, వెనుక గుమ్మం, ముందు తలుపు ప్రస్తావనలతో చాలా సింబాలిజం వుంది. పోస్టాఫీసుల్లో డిపాజిట్లు రిస్కులో వున్నాయని మీడియా రిపోర్టులు వచ్చాయి కూడా.

    ఓటరు ఐడీ కార్డు వచ్చాక అతడి క్యారక్టర్ ని మార్చేస్తారు ఎన్నికల్లో పోటీ పడుతున్న అన్నదమ్ములు. తనని రాజాలా చూసుకోవడం చేస్తూంటే సంపూర్ణేష్ మరింత డిగ్నిటీ నటించి క్యారక్టర్ ని ఇంకో లెవెల్ కి తీసికెళ్తాడు. మళ్ళీ యధాస్థితి కొచ్చి పూర్వపు చెప్పులు కుట్టే వాడు అయిపోతాడు. చివరికి ఓటింగ్ చేసేప్పుడు కింగ్ అయిపోతాడు. ఎక్కడా ఎదిరించకుండా, ఎవర్నీ ఒక్క మాట అనకుండా, ఓటు పవర్ తో ఓడించేస్తాడు. సంపూర్ణేష్ కి ఐడీ కార్డు వచ్చినప్పట్నుంచీ, ముగింపు షాట్ వరకూ ఏం చేయబోతున్నాడో ఎడతెగని ఒక సస్పెన్స్ తో అతడి క్యారక్టర్ కొనసాగుతుంది.

    ఇక పోస్ట్ మాస్టర్ వసంతతో చేతకాని ప్రేమాయణం కూడా నడుపుతాడు. ఈ రీమేక్ నటుడిగా సంపూర్ణేష్ తనని పరీక్షించుకోవడానికి కొలమానంగా ఉపయోగపడింది. ఇందులో పడికి పది మార్కులూ పొందాడు. అలాగే అన్నదమ్ములుగా నటించిన నరేష్, వెంకటేష్ లు తమ విలనీని ఎత్తుగడలతో రంజింపజేస్తూ పోయారు. తమని గెలిపించే ఓటు కోసం ప్రత్యర్ధులు ఏమేం చేస్తారో సినిమాటిక్ గా కాకుండా, రియల్ లైఫ్ లో ఏమేం ఎత్తుగడలు వేస్తారో డెటెయిలింగ్ చేస్తూ నడిపడం వల్ల కథనానికి కొత్తదనం, బలం వచ్చాయి. ఇతర సహాయ పాత్రల్లో అందరూ ఓకే.

    అయితే టెక్నికల్ గా తమిళంలో వున్నంత వాస్తవికతని ప్రతిబింబించ లేదు. తమిళంలో రియలిస్టిక్ జానర్ కి తగ్గ ఒక రిధమ్, ఒక విజువల్ క్రాఫ్ట్ కన్పిస్తాయి. సెటైర్ గా వుండే సీన్స్ కి ఆ ఫీల్ నిస్తూ, సాఫ్ట్ విజువల్స్ చూపిస్తూ ఆకస్మిక కట్స్ ఇస్తాడు. ప్రత్యర్ధుల సీరియస్ సీన్లు వచ్చేసరికి డార్క్ లైటింగ్ ఉపయోగిస్తూ, ఎమోషన్లు హైలైట్ అయ్యే క్యారక్టర్ ఫ్రేమింగ్ ఇస్తాడు. బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ సెటైరికల్ గా, లైట్ మ్యూజిక్ తో ఇచ్చాడు. వీటి మీద పట్టు సాధించాలి కొత్త దర్శకురాలు.

    చివరికేమిటి

    ‘మండేలా’ లాంటి ప్రయోజనాత్మకాన్ని రీమేక్ చేయాలనుకోవడం మంచి ఆలోచన. అయితే ఇది సబ్ టైటిల్స్ తో నెట్ ఫ్లిక్స్ లో ఇదివరకే వచ్చేసి తెలుగు వాళ్ళు చూశారు. తెలుగులో ఇప్పుడు థియేట్రికల్ విడుదల సంపూర్ణేష్ బాబు కోసం చూడాలి. తమిళంలో ముగింపే ఒకే షాట్ తో మరీ ఇంటలెక్చువల్ గా వుంటుంది. దీన్ని తెలుగులో పెంచి డ్రమటైజ్ చేసి వుంటే సామాన్యులకి బాగా అర్ధమయ్యేది. జాలి పుట్టించే సున్నిత హాస్యంతో ఒక పెద్ద రాజకీయ సమస్యనే, కుల సమస్యనే, ఎవర్నీ నొప్పించకుండా ఆలోచింప జేసే చిత్రీకరణలతో ఆశ్చర్యపర్చే ప్రతిభ కనబర్చాడు కొత్త తమిళ దర్శకుడు. కొత్త దర్శకురాలు పూజా కొల్లూరు దీని మీద ఇంకా కృషి చేయాలి. కంటెంట్ మీద తనకెంత పట్టుందో టైటిల్ పెట్టడం దగ్గరే దొరికిపోయేలా వుండకూడదు.

    Puja Kolluru Sampoornesh Babu
    Previous Articleవినోదరంగంలో ఉన్నత పదవుల్లో స్త్రీలు చాలా తక్కువ
    Next Article ఎక్స్ (ట్విటర్) లో కొత్త కాలింగ్ ఫీచర్లు!
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.