Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, September 11
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Cinema & Entertainment

    మంచి మలయాళ (తెలుగు) సినిమా ‘ఆవాస వ్యూహం’ రివ్యూ

    By Telugu GlobalAugust 30, 20226 Mins Read
    మంచి మలయాళ (తెలుగు) సినిమా 'ఆవాస వ్యూహం' రివ్యూ
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    (మలయాళం – తెలుగు వెర్షన్)

    దర్శకత్వం: కృషంద్

    తారాగణం: రాహుల్ రాజగోపాలన్, నిలీన్ సంద్ర, గీతీ సంగీత, శ్రీనాథ్ బాబు, శ్రీజిత్ బాబు, ఝింజ్ షాన్

    రచన: కృషంద్, రినాయ్ స్కేరియా జోస్; సంగీతం : అజ్మల్ హస్బుల్లా, ఛాయాగ్రహణం : విష్ణు ప్రభాకర్

    నిర్మాత: కృషంద్

    విడుదల: ఆగస్టు 4, 2022, సోనీ లైవ్

    సాధారణంగా వచ్చే సినిమాలు ఒకే అర్ధంలో వుంటాయి : ఓ జానర్, ఆ జానర్ మర్యాదలకి సంబంధించిన వివిధ మసాలా దినుసులూ, ఇంతే. ఇంత మాత్రం అర్ధంతో వచ్చిన సినిమాలే వస్తూంటాయి. ఇలా కాకుండా వివిధ మసాలా దినుసుల బదులు ఏకంగా వివిధ జానర్లతోనే ఇంకెంతో అర్ధాన్నే చెప్తే? వూహించడానికే వంద సంవత్సరాల దూరానికి నెట్టేసి, వివిధ సజాతి, విజాతి జానర్లన్నీ మసాలా దినుసులుగా వాడేసి, సినిమా అనే అర్ధానికే ఇంకా తెలియని అర్ధాలు చెప్తే? వస్తువు కంటికి కన్పించే అర్దంతోనే వుండదు. వస్తువుని పోస్ట్ మార్టం చేసి మరిన్ని అర్ధాలు కన్పించేలా చేయొచ్చు. ఇదే సినిమా నిర్మాణానికీ వర్తిస్తుంది. సినిమా అనే రొటీన్ అర్ధానికి వెనకాల ఇంకా అనుభవించగల ఎలిమెంట్లున్నాయి గానీ, వాటి జోలికి పోవడానికి మనస్కరించదు. ఉన్న ఆ వొక అర్ధాన్నే పట్టుకుని పుష్కరాలకి పుష్కరాలు గోదారి ఈదడం… గోవిందా అనుకుంటూ గోదాములో చేరిపోవడం!

    బాంబే ఐఐటీ పూర్వ అధ్యాపకుడైన దర్శకుడు కృషంద్ ‘ఆవాస వ్యూహం’ తో దీనికి సమాధానం చెప్పాడు. తను చేసిన ఈ అనితర సాధ్య ప్రయోగమెలాటి దంటే, మేధావుల మెప్పుకే కాదు, ఏ జీవితాల గురించి ఇందులో చూపించాడో ఆ సగటు ప్రేక్షకులు చూసి వినోదించడానిక్కూడా అందించాడు. వివిధ జానర్ల మిశ్రమంతో కథ చెప్పే దృశ్య భాషనే మార్చేసినా, సగటు ప్రేక్షకుల నాలెడ్జికి అందేలా సూపర్ హీరో క్యారక్టర్ని- మీరే ఈ క్యారక్టర్ అన్నట్టుగా, మీరూ చెడుని ఎదుర్కోవచ్చన్న కర్తవ్య బోధ చేశాడు. వ్యవస్థతో పోరాటమంటే అధికార కేంద్రంతో తలపడ్డం సినిమా సూపర్ హీరోలు చేసే పెద్ద పని. సామాన్యుడేం చేయగలడు- రోజువారీ తన కెదురయ్యే కప్పారావు కుప్పారావుల పనిపట్టగలడు. వ్యవస్థలో రేపటి భాగస్థులు కావాలని ఉవ్వీళ్ళూరే కప్పారావు కుప్పారావుల పనిబడితే వ్యవస్థ పనిబట్టినట్టే. పోరాటం పక్కనున్నోడితోనే ప్రారంభం కావాలి. ఈ పోరాటమేమిటో, సామాన్యుల సూపర్ హీరో ఎలా పోరాడేడో ఇప్పుడు చూద్దాం…

    కథ

    అతను జాయ్ (రాహుల్ రాజగోపాలన్) అనే ఆధార్ కార్డులేని, రేషన్ కార్డు లేని అనామకుడు. ఎక్కడ్నించి వచ్చాడో, తన వాళ్ళెవరో తెలీదు. నేపాల్ నుంచి వచ్చాడని, శ్రీలంక నుంచి వచ్చాడని, కాదు బంగ్లా దేశ్ నుంచీ వచ్చాడనీ చెప్పుకుంటారు. అతను మత్స్యకారుడు. అతను నోటితో చేసే శబ్దాలకి చుట్టూ వచ్చి చేరిపోతాయి చేపలూ కప్పలూ. ఇతడికేవో మానవాతీత శక్తులున్నాయనుకుంటారు జనం. కానీ మత్స్యాహారం తినడు. వాటిని వలేసి పట్టడం కూడా ఇష్టముండదు. కేరళ పశ్చిమ కనుమల్లో కోచ్చి సమీపంలో సముద్ర తీరాన పుథువైపిన్ అనే వూళ్ళో వచ్చి చేరాడు.

    ఇదే వూళ్ళో లిజ్జీ (నిలీన్ సంద్ర) అని లిటిల్ రాఘవన్ కూతురుంటుంది రొయ్యల డిపోలో పని చేస్తూ. ఈమెకొక సంబంధం వస్తుంది. అతను పడవల యజమాని సజీవన్. వీడు పెళ్ళాన్ని చంపినోడని వద్దని అనేస్తుంది. ఎలాగైనా పెళ్ళిచేసుకోవాలని సజీవన్ తమ్ముడు అనూజన్ మురళి (శ్రీనాథ్ బాబు) తో కలిసి పథకమేస్తాడు. జాయ్ అడ్డుకుంటే, అనూజన్ మురళి ‘ప్లాంక్’ (నిఖిల్ ప్రభాకరన్) అనే క్రాక్ రౌడీని తీసుకుని జాయ్ మీద దాడి కెళ్ళి, నెత్తి పగుల గొట్టించుకుంటాడు. ఇంకోసారి స్వయంగా సజీవనే దాడికొస్తే, జాయ్ రెండు పీకుళ్ళు పీకి సజీవన్ ని నిర్జీవన్ చేసేసి పారిపోతాడు. ఎక్కడికి పారిపోయాడో తెలీదు. అతడ్ని ప్రేమిస్తున్న లిజ్జీ బెంగ పెట్టుకుని వుంటుంది.

    జాయ్ ఎక్కడి కెళ్ళాడు? వెళ్తే మళ్ళీ ఎలా వచ్చాడు? ఎవరు తీసికొచ్చారు? వచ్చి ఏం చేశాడు? పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తే మళ్ళీ ఎలా వచ్చాడు? ఏ రూపంలో వచ్చాడు? వచ్చి సరాసరి పారిస్ జువాలజీ మ్యూజియంలో అస్థిపంజరంగా ఎలా తేలాడు? ఈ చిక్కు ప్రశ్నలకి సమాధానమే మిగతా కథ.

    ఎలావుంది కథ

    ఈ కథ పర్యావరణ పరిరక్షణ గురించి. జీవవైవిధ్యం ఎంత విస్తారంగా వుంటే అంత పర్యావరణానికి ప్రయోజనకరమని చెప్పడం గురించి. పురోగతి అంటే స్వచ్ఛమైన గాలి, నీరు దొరకడమని చెప్పడం గురించి. ఈ కథలో చూపించిన పుథువైపిన్ లో 2017 నుంచీ ప్రజా పోరాటం జరుగుతోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అక్కడ ఎల్ పి జి ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు నిరవధిక పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం అక్కడ నిరవధిక 144 సెక్షన్ విధించింది. పర్యావరణానికీ ప్రజా జీవితానికీ ఈ ప్లాంట్ హానికారకమని ప్రజల అభ్యంతరం.

    దీన్ని తీసుకుని ఈ ప్రాంతం చుట్టూ పర్యావరణం కథ అల్లాడు దర్శకుడు. మనిషి వల్ల జీవులు జీవన్మరణ పోరాటం చేస్తున్నాయి. చివరికి అంతరించి పోయే దశలోనూ ఉనికిని చాటుకుంటూ సంకరం చెంది కొత్త జీవులుగా ఉద్భవించినా, ఇది ప్రకృతి వైపరీత్యమని మనిషి దాన్నీ అంతం చేస్తున్నాడు… ఈ కథలో ప్రకృతికి ప్రతీకగా వున్న పాత్ర జాయ్, కప్ప మనిషిగా మారినా మన్నించలేదు మనుషులు- అంతరించిపోయిన జీవుల మ్యూజియంలో పారిస్ లో కంకాళంగా మిగలాల్సిన పరిస్థితి.

    ప్రపంచీకరణ వచ్చేసి ప్రపంచాన్ని చదును చేసేసిందని ప్రసిద్ధ పాత్రికేయుడు థామస్ ఫ్రీడ్మన్ ఏనాడో ‘ది వరల్డ్ ఈజ్ ఫ్లాట్’ అన్న పుస్తకమే రాశాడు. ఆ చదును చేయడంలో విలువలు, ఆత్మలు, ప్రాణాలు సమస్తం నలిగిపోయాయన్నాడు. దీన్నే చెబుతూ 2018 లో అభయ సింహా తుళు భాషలో ‘పడ్డాయి’ (పడమర) తీశాడు. ఇదొక అద్భుత ప్రయోగం. షేక్స్ పియర్ పాపులర్ ‘మాక్బెత్’ నాటకాన్ని ఇక్కడి పర్యావరణ కథగా మార్చేశాడు.

    సామాజికంగా ఆర్ధికంగా ఆధునిక యుగంలో ప్రవేశించిన దేశాకాల పరిస్థితుల్ని ‘మాక్బెత్’ ఆధారంగా చూపించాడు. ఇక్కడి జాలర్లు వేటకి సముద్రంలో పడమర వైపు వెళ్తారు. తాము తూర్పుకి చెందిన వాళ్ళు. తూర్పుకి చెందిన తాము ట్రాలర్ల సాక్షిగా పడమర – అంటే పాశ్చాత్య విలువలకి మారాలన్న తహతహతో పాల్పడే చర్యల పరిణామాల్ని గొప్పగా చిత్రించాడు. వర్షాకాలం చేపలు గుడ్లు పెట్టే కాలమని వేటని నిషేధించిది ప్రభుత్వం. నిషేధాన్ని ఉల్లంఘించి కంపెనీల వాళ్ళు ట్రాలర్లతో ఫిషింగ్ చేస్తూ గుడ్లని నాశనం చేస్తున్నారు. ఇంకా పర్యావరణానికి హాని కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యాన్ని కూడా కథలో చిత్రించాడు.

    ‘పడ్డాయి’ – ‘ఆవాస వ్యూహం’ రెండూ మత్స్యకారుల జీవితాలాధారంగా పర్యావరణ సమస్యని ఎత్తి చూపిస్తున్నవే. రెండూ క్రైమ్ థ్రిల్లర్లే. ‘పడ్డాయి’లో మత్స్యకారులైన భార్యాభర్తలు దురాశకి పోయి చేపల కాంట్రాక్టర్ ని హత్యచేసి, అతడి వ్యాపారాన్ని హస్తగతం చేసుకునే కుట్ర అయితే, ‘ఆవాస వ్యూహం’ లో పెళ్ళి కోసం అమ్మాయిని వేధిస్తున్న చేపల కాంట్రాక్టర్ ని చంపే నేరం.

    అయితే దీన్ని హాస్యరస ప్రధానంగా చెప్పాడు దర్శకుడు కృషంద్. సమస్య తీవ్రమైనదే, కానీ ఏ పాత్రా సీరియస్ గా మాట్లాడదు. వేళాకోళమే. ‘చెట్లు పెంచితే మావోయిస్టు నయ్యానంటే నేను మావోయియిస్టుగానే వుంటాన్లే’… ‘వాడు క్రిమినల్, కిల్లర్, టెర్రరిస్ట్, యాంటీ నేషనలిస్ట్’ … ‘విరక్తి అంటే ఏంటి?’ – ‘అది బాధరా’- ‘రాజ్యాంగం అంటే ఏమిటి?’ – ‘అదొక బుక్కురా’ …’ఆకలేస్తోంది’ – ‘గ్లూకోసు ఎక్కించారు కదా, అది కూడా చాల్లేదా నీకూ?’ …ఇలా వుంటుంది పాత్రల ధోరణి.

    2015 లో కన్నడ దర్శకుడు రాంరెడ్డి ‘తిధి’ అనే ఆర్ట్ సినిమాని ఇంతే వినోద భరితంగా తీశాడు. చనిపోయిన 101 ఏళ్ళ తాత మరణం చుట్టూ వివిధ ఆచారాలూ, ప్రవర్తనా లోపాలపైన ఆలోచనాత్మక వ్యంగ్యాస్త్రాలు విసిరిన అపూర్వ ప్రయోగమిది- 20 జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో. ఒక మరణం, దాంతో పేదరికంలో పుట్టే స్వార్ధం, దాంతో మోసం, కుటుంబ సంబంధాల లేమి మొదలైన సీరియస్ విషయాలని నవ్వొచ్చేట్టు చూపించాడు. ఇలా ఆర్ట్ సినిమాల్ని ఎంటర్టయినర్లుగా మార్చి, నేటి తరం ప్రేక్షకులకి సామాజిక అవగాహన కల్పించే దిశగా ప్రయాణిస్తున్నారు ఇలాటి దర్శకులు.

    అయితే ‘ఆవాస వ్యూహం’ దర్శకుడు హాస్యమాధారంగా కథ చెప్పడానికి వాడిన పరికరాలు, జీవ వైవిధ్యపు కథకి వైవిధ్య కళా ప్రక్రియల సంకలనంగా వుండడమే ఇతర ఆర్ట్ సినిమాల నుంచి దీన్ని వేర్పరుస్తోంది. బ్లాక్ కామెడీతో కథనం హాస్యంగా వుండడమే గాక, థ్రిల్లర్, ఎలక్ట్రానిక్ మీడియా, డాక్యుమెంటరీ, రషోమన్ ఎఫెక్ట్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ జానర్లని అతుకులేసినట్టు కన్పించకుండా సంకలనం చేసిన కళే విస్మయ పరుస్తుంది.

    నటనలు- సాంకేతికాలు

    ‘సూపర్ హీరో’ జాయ్ గా రాహుల్ రాజగోపాలన్ ది హీరోయిజాన్ని ప్రదర్శించే పాత్ర కాదు. అతను ప్రకృతికి ప్రతీక. ప్రకృతిలో కలిసిపోయి వుంటాడు. జలచరాలు అతడి పిలుపు వింటే వచ్చేస్తాయి. ఇలాటి ఇతను మనిషి చేతిలో ప్రకృతి లాగా స్ట్రగుల్ చేస్తూంటాడు. తిరగబడాల్సిన చోట తిరగబడతాడు. ప్రకృతితో మనిషి, మతం, సైన్స్, ప్రభుత్వం, రాజకీయం, మీడియా వీటన్నిటి స్వార్ధ వైఖరులు ఇతడి దృష్టి కోణంలో తేటతెల్ల మవుతూంటాయి. వీటికి వ్యంగ్య భాషణం చేస్తూంటాడు. అతడి ముఖంలో అమాయకత్వమే వుంటుంది. బానిసగా నటన కూడా సింపుల్ గా వుంది.

    ఇతడ్ని ప్రేమించే లిజ్జీగా నిలీన్ సంద్రది చివరంటా అతడ్ని వెతుక్కునే పాత్ర. మధుస్మితగా గీతీ సంగీత క్లయిమాక్స్ లో వచ్చి కథని మలుపు తిప్పుతుంది. జాయ్ ని వాడుకుని చేపల వ్యాపారం చేసుకునే సుశీలన్ పాత్రలో ఝింజ్ షాన్ ది కూడా కీలకపాత్రే. ఇక జాయ్ ని చంపాలని చూసే, హాస్యంగా సాగే జంట పాత్రలు పోషించిన శ్రీనాథ్ బాబు, నిఖిల్ ప్రభాకరన్ లు చివరికి కథని తామే ముగిస్తారు. ఈ నటులెవరూ కూడా కమర్షియల్ నటనల జోలికి పోకుండా, మన చుట్టూ వుండే మనుషుల్లాగే మాట్లాడతారు, ప్రవర్తిస్తారు. సాంకేతికంగా పైన చెప్పుకున్నట్టు వివిధ జానర్ల మిశ్రమానికి సి. రాకేష్ ఎడిటింగ్ కష్టమైన పనే. జానర్లతో మారిపోతూ వుండే శైలీ శిల్పాలతో కూడిన విజువల్స్ ని, సమ్మిళితం చేసిన తీరు మెచ్చదగిందే. దర్శకుడు తలపోసిన కళాఖండపు గౌరవానికి తగ్గకుండా ప్రొడక్ట్ ని చెక్కి అందించాడు ఎడిటర్. అలాగే నేటివిటీకి తగిన స్వరాలు కూర్చిన సంగీత దర్శకుడు అజ్మల్ హస్బుల్లా. ఛాయాగ్రహణంతో అద్భుత విజువాల్స్ సృష్టించిన విష్ణు ప్రభాకర్. సముద్రం, నాడీ తీరాలూ, అటవీ లోతట్టు ప్రాంతాలూ, క్రిమికీటకాల నుంచీ వివిధ జీవుల కలాపాలూ ఈ పర్యావరణపు కథా చిత్రానికి వన్నె తెచ్చాయి.

    గొప్ప సినిమా తీయాలంటే ప్రకృతంత విశాల దృక్పథం వుండాలని దీంతో రుజువు చేశాడు దర్శకుడు కృషంద్.

    Aavasavyuham Aavasavyuham Review
    Previous Articleకాంగ్రెస్‌ బలపడటం దేశానికి అనివార్య అవసరం
    Next Article ఉప్పు ఎక్కువ, నీరు తక్కువ తీసుకుంటున్నారా..? ప్రమాదంలో ఉన్నారు జాగ్రత్త..
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.