Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Friday, September 12
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Cinema & Entertainment

    ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీ రివ్యూ!

    By Telugu GlobalSeptember 17, 20225 Mins Read
    'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీ రివ్యూ!
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    చిత్రం : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

    రచన -దర్శకత్వం : ఇంద్రగంటి మోహన కృష్ణ

    తారాగణం : సుధీర్ బాబు, కృతీ శెట్టి, అవసరాల శ్రీనివాస్, శ్రీకాంత్ అయ్యంగర్, కళ్యాణీ నటరాజన్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు

    సంగీతం : వివేక్ సాగర్ , ఛాయాగ్రహణం : పీజీ విందా

    బ్యానర్స్ : బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్

    నిర్మాత : మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి

    విడుదల : సెప్టెంబర్ 16, 2022

    రేటింగ్ 3/5

    సుధీర్ బాబు- ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో ‘సమ్మోహనం’ తర్వాత ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ కూడా సినిమా ప్రపంచానికి సంబంధించిన కథే. ఇందులో లేటెస్ట్ టాలీవుడ్ క్వీన్ కృతీ శెట్టి హీరోయిన్. ఈ రోమాంటిక్ డ్రామా పోస్టర్స్, టీజర్, ట్రైలర్ వైరల్ అయ్యాయి.

    కథ

    నవీన్ (సుధీర్ బాబు) టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్. మొదటి మగాడు, కసక్, గుడ్ బాయ్- బ్యాడ్ బాయ్ వంటి ఆరు సూపర్ హిట్స్ ఇచ్చి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూంటాడు. ఏడో సినిమా ప్లాన్ చేస్తాడు. ఏ కథ, ఏ హీరో, హీరోయిన్లతో తీసిన అభ్యంతరం లేదని నిర్మాత పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తాడు. కొత్త హీరోయిన్ గురించి ఆలోచనలో నవీన్ కి చెత్త కుప్పలో ఒక సినిమా రీలు దొరుకుతుంది. ఆ రీలు వేసి చూసి షాక్ అవుతాడు. అందులో ఎవరో అద్భుతంగా వున్నకొత్త హీరోయిన్ నటించింది. ఈమె ఎవరో తెలుసుకోవడానికి కో డైరెక్టర్ బోస్ (వెన్నెల కిషోర్), రైటర్ రమణ (రాహుల్ రామకృష్ణ) లతో కలిసి వేట మొదలెడతాడు ఆమె కంటి డాక్టర్ అలేఖ్య (కృతీశెట్టి) అని తెలుస్తుంది. కానీ అలేఖ్యకి సినిమాలన్నా, సినిమా వాళ్ళన్నా ద్వేషం. ఆమె తల్లిదండ్రులు (శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణీ నటరాజన్) కూడా ద్వేషిస్తారు. అయినా ఎలాగైనా అలేఖ్యని హీరోయిన్ గా నటించేందుకు ఒప్పించే ప్రయత్నంలో, సినిమాలంటే ఆమెకెందుకు ద్వేషమో తెలుసుకుని షాక్ అవుతాడు.

    ఏమిటామె చెప్పిన విషయం? దీంతో డిస్టర్బ్ అయిన నవీన్ తిరిగి ఎలా తన ప్రయత్నాలు కొనసాగించాడు? ఈ క్రమంలో ఇంకేమేం జరిగాయి? అలేఖ్య, ఆమె తల్లిదండ్రుల ద్వేషాన్ని ఎలా ప్రేమగా మార్చి దర్శకుడిగా తను ఇంకో మెట్టు పైకెదిగే సినిమా తీశాడు? ఇదీ మిగతా కథ.

    ఎలావుంది కథ

    కేవలం రోమాంటిక్ డ్రామా కాదు, ఇంకా చాలా. ఒక దర్శకుడు స్త్రీ స్వశక్తీకరణ గురించి, విముక్తి గురించీ ఎన్నో సినిమాలు తీయొచ్చు. నిజ జీవితంలో అలాంటి స్త్రీని ఒక్కరినైనా ఉద్ధరించి సినిమాలు తీసే వాడుంటాడా? వాడు కదా గొప్ప దర్శకుడు? కూతుర్ని సంరక్షణ పేరుతో ఆంక్షలు పెట్టే తల్లిదండ్రులు, కూతురు గర్వకారణంగా వుండాలని ఎందుకు కోరుకోరు? ఆ స్వేచ్ఛ ఎందుకివ్వరు? తోబుట్టువులకి అర్ధమేమిటి? ఒకరి కలని ఇంకొకరు నిజం చేయడం కాదా? కట్టుబాట్లని ధిక్కరించడంలో శాంతి వుంటే.. ఆ శాంతిని ఎందుకు పొందకూడదు?

    పై ప్రశ్నల సమాహారమే ఈ కథ. రోమాంటిక్ డ్రామాకి పూర్తిగా మార్చేసిన దృక్కోణం, భాష్యం. ఇందులో రోమాన్స్ కంటే జీవితం గురించి ఎక్కువ. అవే పస లేని, ఆదరణ కోల్పోయిన రొటీన్ రోమాంటిక్ కామెడీలు, రోమాంటిక్ డ్రామాల పేరుతో వస్తున్న ప్రేమ సినిమాల మధ్య కాస్త ఆలోచన, అభిరుచీ గల ప్రేక్షకుల కోసం రచయిత, దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ నుంచి మెచ్యూర్డ్ ప్రయత్నం. తెర మీద దర్శకుడి పాత్ర ఎంత ఉన్నతంగా కన్పిస్తుందో, తెరవెనుక ఇంద్రగంటి కూడా అంత గౌరవం పెంచుకుని కన్పిస్తారు. ఇంద్రగంటి సినిమాలన్నీట్లో ఇది టాప్. ఎంత టాప్ అంటే, దీనికి ప్రేక్షకులు తక్కువ. తెలుగులో క్వాలిటీ సినిమాలకి ఇంకా ఎదగాలి కదా ప్రేక్షకులు.

    నటనలు- సాంకేతికాలు

    సుధీర్ బాబు ఏంటో ఈ సినిమాతో తెలుసుకోవచ్చు. జెంటిల్ మెన్‌ దర్శకుణ్ణి అతను ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా తెరమీద ప్రొజెక్ట్ చేశాడు. ప్రతీ సీనులో తన పాత్ర ప్రేక్షకులకి ఆత్మీయంగా అన్పించేలా, ప్రేమించేలా నటించాడు. కుటుంబ సంక్షోభాన్నీ, ఆ కుటుంబంలో కూతురి క్షోభనీ చాలా నీటుగా పరిష్కరించే పాత్రచిత్రణ అతడి నటనకి బలం. ఇది అవార్డు స్థాయి నటన అని చెప్పడం లేదుగానీ, దాదాపూ అలాంటిదే.

    హీరోయిన్ కృతీ శెట్టిది కూడా అవార్డు స్థాయి నటన అని చెప్పడం లేదుగానీ, దాదాపూ అలాంటిదే. సినిమాల్లో హీరోయిన్ పేరుకి పెద్ద హోదాలో వుంటుంది గానీ, వేసేది వెకిలి వేషాలు. లాయరమ్మ మాస్ పాటేసుకుంటుంది. కలెక్టరమ్మ కల్లు తాగి చిందులేస్తుంది. కృతీ శెట్టి డాక్టర్ పాత్ర హోదాకి తగ్గ నటనని చూసి  తలవంచుకోవాలి ‘రంగరంగ వైభవం’ లోని హీరో, హీరోయిన్ల టీనేజీ బిహేవియర్ లేకి డాక్టర్ పాత్రలు కూడా.

    ఇక వెన్నెల కిషోర్. ఇతను ఎంత నటించినా కామెడీ ఇంకా మిగిలే వుంటుంది. సినిమా తర్వాత సినిమా కొసరి కొసరి వడ్డిస్తుంటాడు. ‘ఒకేఒక జీవితం’ లో బ్రోకర్ పాత్రలో ఎలా ఒదిగిపోయాడో ఇక్కడ కోడైరెక్టర్ పాత్రలో అలా ఒదిగి కామిక్ రిలీఫ్ కి తోడ్పడ్డాడు. కమెడియన్ రాహుల్ రామకృష్ణ రైటర్ పాత్రలో నవ్వించడానికి రాలేదు- హీరోకి పెద్ద మనిషి తరహా సపోర్టు నిచ్చే జగ్గయ్యలా అన్పిస్తాడు. వీళ్ళిద్దరు కూడా అవార్డు తీసుకోవచ్చని అనడం లేదుగానీ, తీసుకునే కెపాసిటీ వుంది.

    సెంటిమెంట్ల పేరుతో రొడ్డ కొట్టుడు నాటు తల్లితండ్రుల పాత్రలకి అలవాటు పడ్డ ప్రేక్షకులకి ఇక్కడ శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణీ నటరాజన్ లు ఓ కుదుపు నిస్తారు. వీళ్ళిద్దరి కూతురు కృతీ పాత్రతో పతాక స్థాయికి తీసికెళ్ళారు సంక్లిష్ట హ్యూమన్ డ్రామాని. పిల్లలు ఏడ్పిస్తే పేరెంట్స్ ఏడ్పు ఎలా వుంటుందనడానికి శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన చివరి భావోద్వేగ సన్నివేశం నిజ జీవితం ఇలాగే వుంటుందనడానికి తార్కాణం. ఇది ఎక్కడో గుచ్చుకుని గిల్టీ ఫీలింగ్ తో లేచి వెళ్ళి పోయే ప్రేక్షకులూ వుంటారు. ఇది దర్శకుడి విజయమే. శ్రీకాంత్, కళ్యాణీ లది కూడా అవార్డు స్థాయి నటన అని చెప్పడం లేదుగానీ, దాదాపూ అలాంటిదే.

    ఇక మైనర్, సహాయ పాత్రలు నటించిన వాళ్ళూ కూడా కథ శిల్పం, మూడ్, ఫీల్ ని చెడగొట్టకుండా అందులో భాగమై కనిపిస్తారు. సాంకేతిక ప్రమాణాల్లో పీజీ విందా కెమెరా వర్క్ బ్యూటీఫుల్ విజువల్స్ ని సృష్టించింది. కాస్ట్యూమ్స్ ఎంపిక, కళా దర్శకత్వం, సెట్స్, లొకేషన్స్ పైస్థాయిలో వున్నాయి. వివేక్ సాగర్ సంగీతం లో అల్లరల్లరి టైటిల్ సాంగ్, ఇంకో ఐటెమ్ సాంగ్ తో బాటు, బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ కి సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామ జోగయ్య శాస్త్రి కవులు. వివేక్ సాగర్ సన్నివేశాలకి కూర్చిన నేపథ్య సంగీతం భారీ ఆర్కెస్ట్రైజేషన్ తో హాలీవుడ్ స్టయిల్లో రిచ్ నెస్ ని తీసుకువచ్చింది. ఇక ఇంద్రగంటి రచన, దర్శకత్వం ఆయన సినిమాల్ని ఎంత సీరియస్ గా తీసుకుంటాడో తెలియజేస్తాయి. ఈ ప్రమాణాల్ని మున్ముందు కూడా అందిస్తాడని ఆశించాలి.

    చివరికేమిటి

    ఇంటర్వెల్ దాకా సమయం వృథా చేయకుండా వెంటనే పది నిమిషాల్లో సినిమా రీలు దొరకడంతో కథ ప్రారంభమై పోతుంది. ఆ రీల్లో వున్న హీరోయిన్ కృతీ శెట్టి కోసం అన్వేషణ. కానీ దర్శకుడైన సుధీర్ బాబుకి రీల్లో వున్న హీరోయినెవరో వెంటనే తెలుసుకోవచ్చు. ఎవరు తీస్తున్న సినిమా ఆపేశారో లాబ్స్ లో ఆ రీలుని బట్టి ఇట్టే తెలుసుకోవచ్చు. ఈ లాజిక్ ని పక్కన బెట్టారు. ఆమె కోసం సినిమాటిక్ అన్వేషణ, కామెడీలు.

    చివరికి కృతీ డాక్టర్ అని తెలిశాక, సినిమా వాళ్ళంటే ద్వేషంతో ఆమె ట్రాక్. సుధీర్ రొట్ట మాస్ సినిమాల డైరెక్టర్ అని కూడా అసహ్యం. దీన్ని పోగొట్టడానికి ఒక సెమినార్ లో రెండు కోట్లు విరాళం ప్రకటిస్తాడు. దీనికి కూడా లొంగదు. అప్పుడు అదే సెమినార్ లో చెత్త సినిమాలు తీసే వాడుకూడా ఏదో మేలు చేసే ఒక డైలాగు రాస్తాడని, దాంతో కనీసం ఒకడైనా చిరస్మరణీయుడవుతాదన్న సన్నివేశం సోదాహరణగా ప్రూవ్ అయి అతను ఉన్నతుడై పోతాడు.

    హీరోయిన్ మనసుని మార్చే ఈ సీను క్రియేషన్ చాలా టాప్ క్లాస్. కథ లోతుపాతుల్లోకి వెళ్ళి తవ్వి తీసిన క్రియేటివిటీ. మళ్ళీ సెకండాఫ్ లో ఆమెని నటించడానికి ఒప్పించేందుకు సుధీర్ చెప్పే తన ఫ్లాష్ బ్యాక్ కూడా ఇలాంటిదే టాప్ క్లాస్.

    ఇంటర్వెల్లో ఆ సినిమా రీలులో తనని చూసుకుని కృతి చెప్పే విషయంతో కథ అనుకోని మలుపు తిరుగుతుంది. సెకండాఫ్ లో ఆమె ఫ్లాష్ బ్యాక్ తో ద్వేష కారణం పూర్తిగా అర్ధమవుతుంది.

    ఇప్పుడు సుధీర్ కథ మార్చేసి ఆమె పేరెంట్స్ కి తెలియకుండా ఆమె హీరోయిన్ గా షూటింగ్ ప్రారంభిస్తాడు. ఇది చాలా విపరిణామాలకి దారి తీస్తుంది పేరెంట్స్ తో క్లయిమాక్స్ కొచ్చేసరికి- అన్ని సమస్యలకీ పరిష్కారంగా అదే రీలుతో కలిపి తీసిన సినిమా వేసి, సృష్టించే వూహించని పతాక స్థాయి డ్రామా మాస్టర్ స్ట్రోక్ గా వుంటుంది. సున్నిత పాత్రల బలమైన మానసిక సంఘర్షణల క్వాలిటీ చిత్రణ ఇది. అయితే పైన చెప్పుకున్నట్టు ఈ క్లాస్ మూవీకి ప్రేక్షకుల సపోర్టు తక్కువే వుండొచ్చు.

    Aa Ammayi Gurinchi Meeku Cheppali Sudheer Babu
    Previous Articleఉల్లితో షుగర్ కి చెక్
    Next Article మెదడు ఆరోగ్యం కోసం ఆరు చిట్కాలు
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.