Wipro - Rishad Premji | రెండో ఏటా వేతన ప్యాకేజీ తగ్గించుకున్న రిషాద్ ప్రేమ్‌జీ.. ఐటీ సెక్టార్‌లోనే గరిష్ట వేతనం ఆ సీఈఓకే..!
Wipro - Rishad Premji | దేశీయ ఐటీ రంగం వృద్ధిరేటు నెమ్మదిస్తోంది. ఫలితంగా ఆయా కంపెనీలు తమ వృద్ధిరేటు గైడెన్స్ కుదించేస్తున్నాయి. ఈ తరుణంలో దేశీయ ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒక్కటైన విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషాద్ ప్రేమ్‌జీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో తన వార్షిక వేతనం తగ్గించేసుకున్నారు.
Wipro - Rishad Premji | దేశీయ ఐటీ రంగం వృద్ధిరేటు నెమ్మదిస్తోంది. ఫలితంగా ఆయా కంపెనీలు తమ వృద్ధిరేటు గైడెన్స్ కుదించేస్తున్నాయి. ఈ తరుణంలో దేశీయ ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒక్కటైన విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషాద్ ప్రేమ్‌జీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో తన వార్షిక వేతనం తగ్గించేసుకున్నారు. రిషాద్ ప్రేమ్‌జీ వార్షిక వేతనం తగ్గించుకోవడం వరుసగా ఇది రెండో ఏడాది. ఇంతకుమందు 2022-23లోనూ తన వార్షిక వేతనాన్ని ఆయన తగ్గించుకున్నారు. కంపెనీ కన్సాలిడేటెడ్ ఆర్థిక ఫలితాల్లో నికర లాభాలు నెగెటివ్‌గా ఉన్నందున రిషాద్ ప్రేమ్‌జీ తన వేతన ప్యాకేజీ తగ్గించుకున్నారని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్‌లో ఇటీవల 20-ఎఫ్ ఫైల్ చేసింది విప్రో.
రిషాద్ ప్రేమ్‌జీ గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో వార్షిక వేతనం (కాంపన్‌సేసన్ ప్యాకేజీతోపాటు) లో దాదాపు 20 శాతం కోత విధించుకున్నారు. 2023-24లో సుమారు రూ.6.5 కోట్లు (7,69,456 యూఎస్ డాలర్లు) వేతనం తగ్గించుకున్నారు. అంతకుముందు 2022-23లో దాదాపు రూ.7.9 కోట్లు (9,51,353 యూఎస్ డాలర్లు) వేతనంలో కోత విధించుకున్నారు. దీంతో దీర్ఘకాలిక పరిహారంతోపాటు 2022-23తో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో రిషాద్ ప్రేమ్‌జీ వార్షిక వేతనం రూ.7.2 కోట్ల (8,61,000 యూఎస్ డాలర్లు) నుంచి రూ.5.8 కోట్ల (6,92,641 యూఎస్ డాలర్లు)కు పడిపోయింది.
విక్రో కన్సాలిడెట్ నికర లాభంలో 0.35 శాతం కమిషన్‌ను రిషాద్ ప్రేమ్‌జీకి విప్రో చెల్లించాల్సి ఉంటుంది. కానీ గత ఆర్థిక సంవత్సరంలో ప్రతికూల నికర లాభాలు నమోదైనందున రిషాద్ అజీం ప్రేమ్‌జీకి ఎటువంటి కమిషన్ చెల్లించడం లేదని విప్రో తన ఫైలింగ్‌లో తెలిపింది. ఈ ఏడాది రిషాద్ ప్రేమ్‌జీకి ఎటువంటి స్టాక్ ఆప్షన్లు గ్రాంట్ కాలేదు. 2019లో ఐదేండ్ల పదవీ కాలానికి విప్రో చైర్మన్‌గా రిషాద్ ప్రేమ్‌జీ నియమితులయ్యారు. తాజాగా మరో ఐదేండ్లు అంటే 2029 జూలై 30 వరకూ ఆయన్ను చైర్మన్‌గా నియమిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకున్నది.
2021-22లో రిషాద్ ప్రేమ్‌జీ అతి తక్కువగా 43.34 శాతం రెమ్యూనరేషన్ తీసుకుంటే, కంపెనీ మాజీ సీఈఓ కం ఎండీ థెర్రీ డెలాపోర్టే రెమ్యూనరేషన్ 3.26 శాతం పెరిగింది. ఐటీ రంగంలోనే అత్యధికంగా వేతనం అందుకున్న సీఈఓగా థెర్రీ డెలాపోర్టే రికార్డు సృష్టించారు. 2023-24లో ఆయన పరిహారం మొత్తం సుమారు రూ.166.5 కోట్లు (20.11 మిలియన్ యూఎస్ డాలర్లు) అందుకున్నారు. వేరియబుల్ పే 5.06 మిలియన్ డాలర్లతోపాటు ఆయన శాలరీ 3.9 మిలియన్ డాలర్లుగా ఉంది. దీర్ఘకాలిక పరిహారం 4.32 మిలియన్ డాలర్లు, ఇతర చెల్లింపులు 6.84 మిలియన్ డాలర్లు ఉన్నాయి. 2022-23లో డెలాపోర్టే అందుకున్న మొత్తం పరిహారం 10 మిలియన్ల యూఎస్ డాలర్ల పై మాటే.
గత నెలలో విప్రో సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్‌గా రాజీనామా చేసిన థెర్రీ డెలాపోర్టేకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.92.1 కోట్ల ప్రత్యేక చెల్లింపునకు బోర్డు అనుమతించింది. డెలాపోర్టేకు 12 నెలల కనీస వేతనాన్ని సీవరెన్స్ పేగా చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో విప్రో రెవెన్యూ గ్రోత్ రేట్ 0.5 నుంచి మైనస్ 1.5 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది. సూక్ష్మ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు దారుణంగా ఉండటంతో బలహీనతలు కొనసాగుతాయని తెలిపింది.