Telugu Global
Business

రతన్‌ టాటా వారసుడెవరు?

టాటా సామ్రాజ్యానికి తదుపరి అధినేత ఎవరు

రతన్‌ టాటా వారసుడెవరు?
X

టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించే నాయకుడెవరు? రతన్‌ టాటా కన్నుమూయడంతో దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న ఇదే. టాటా వ్యాపార సామ్రాజ్య బాధ్యతలను 4 బిలియన్‌ డాలర్ల వద్ద చేపట్టిన రతన్‌ టాటా తన హయాంలో వంద బిలియన్‌ డాలర్ల మార్క్‌ క్రాస్‌ చేయించారు. ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీల్లో ఒక్కటైనా టాటా గ్రూప్‌ ను ఇప్పుడు ఎవరు ముందుకు నడిపించబోతున్నారనే దానిపై రకరకాల ఈక్వేషన్లు ముందుకు వస్తున్నాయి. టాటా గ్రూప్‌ మొత్తం ఒక్కరి గుత్తాధిపత్యంలో ఉండకుండా రతన్‌ టాటా.. టాటా ట్రస్ట్స్ర్‌, టాటా సన్స్‌ అనే రెండు గ్రూపులు చేశారు. మొదట టాటా సన్స్‌ కు చైర్మన్‌ గా వ్యవహరించిన రతన్‌ టాటా ఆ తర్వాత బాధ్యతల నుంచి తప్పుకొని టాటా ట్రస్ట్స్ర్‌ చైర్మన్‌ పగ్గాలు చేపట్టారు. మరణించే వరకు ఆయన ఆ హోదాలోనే కొనసాగారు. టాటా సన్స్‌ చైర్మన్‌ నుంచి రతన్‌ టాటా తప్పుకున్న తర్వాత సైరస్‌ మిస్త్రీకి పగ్గాలు అప్పగించినా కొన్నాళ్లకే ఆయనను పక్కన పెట్టి రతన్‌ టాటా మళ్లీ పగ్గాలు స్వీకరించారు. ఆ తర్వాత చంద్రశేఖరన్‌ కు బాధ్యతలు అప్పగించారు. టాటా సన్స్‌ కు చైర్మన్‌ గా ఉన్నప్పటికీ చంద్రశేఖరన్‌ ట్రస్ట్‌ బోర్డులో సభ్యుడిగా లేరు. రతన్‌ టాటా వారసుడిగా ఆయన సవతి సోదరుడు నోయెల్‌ టాటా రేసులో ముందున్నారని చెప్తున్నారు. రతన్‌ టాటా తండ్రి నావల్‌ టాటా.. రతన్‌ తల్లి సోనితో విడిపోయాక సిమోనెను వివాహం చేసుకున్నారు. నావల్‌, సిమోని కుమారుడు నోయెల్‌. ఆయన సతీమణి ఆలూ మిస్త్రీ పల్లోంజి గ్రూప్‌ సంస్థల అధినేత పల్లోంజి మిస్త్రీ కుమార్తె. నోయెల్‌, ఆలూ దంపతుల పిల్లలు లేహ, నెవిల్లె, మాయా టాటా గ్రూప్‌ లో వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. టాటా గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ ఎఫైర్స్‌ నోయెల్‌ చేస్తున్నారు. ఇప్పుడు రతన్‌ టాటా వారసత్వం కోసం నోయల్‌ టాటా, సైరస్‌ మిస్త్రీ కజిత్‌ మెహ్లీ మిస్త్రీతో పాటు నోయల్‌ టాటా ముగ్గురు పిల్లలు పోటీలో ఉన్నారు. వారిలో ఎవరికి టాటా గ్రూప్‌ పాలన పగ్గాలు దక్కుతాయో తేలాల్సి ఉంది.

First Published:  10 Oct 2024 10:22 AM GMT
Next Story