ఉద్యోగులకు ‘డ్రై ప్రమోషన్’ బాధలు! ఇదెలా ఉంటుందంటే..
ఉద్యోగంలో ప్రమోషన్ అంటే కొత్త పని బాధ్యతలతోపాటు జీతం కూడా పెరుగుతుంది. కానీ, డ్రై ప్రమోషన్‌లో అలా కాదు. కేవలం బాధ్యతలు పెరుగుతాయి.
కార్పొరేట్ కల్చర్‌లో రకరకాల కొత్త ట్రెండ్‌లు వస్తూ ఉంటాయి. ఇటీవల మూన్ లైటింగ్, క్వైట్ క్విట్టింగ్ వంటి ట్రెండ్‌లు కంపెనీలను ఇబ్బందిపెట్టాయి. అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్న ఓ ట్రెండ్ ఉద్యోగులను ఇబ్బంది పెడుతోందట. అదేంటంటే..
కరోనా తర్వాతి నుంచి వర్క్ స్టైల్‌లో చాలా మార్పులొచ్చాయి. అటు ఉద్యోగులకు ఇటు కంపెనీలకు రకరకాల సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఐటీ సెక్టర్‌లో రిసెషన్ కూడా నడుస్తోంది. కంపెనీలు భారీసంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఉన్న ఉద్యోగులపై అదనపు భారం వేయకతప్పట్లేదు. ఇందులో భాగంగానే ‘డ్రై ప్రమోషన్’ అనే కొత్త ట్రెండ్‌కు తెరలేపాయి కంపెనీలు.
ఉద్యోగంలో ప్రమోషన్ అంటే కొత్త పని బాధ్యతలతోపాటు జీతం కూడా పెరుగుతుంది. కానీ, డ్రై ప్రమోషన్‌లో అలా కాదు. కేవలం బాధ్యతలు పెరుగుతాయి. శాలరీలో ఎలాంటి హైక్ ఉండదు. దీన్నే ఇప్పుడు ‘డ్రై ప్రమోషన్’ అంటున్నారు. ఉద్యోగంలో డిసిగ్నేషన్ పెంచుతారు, పని బాధ్యతలు పెరుగుతాయి. కానీ, జీతంలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ ధోరణిపై ప్రస్తుతం ఉద్యోగులు నిరాశతో ఉన్నారు. ఈ ట్రెండ్ వల్ల కంపెనీలు మరింతమంది ఉద్యోగులను కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కొన్ని నివేదికల ప్రకారం 2018లో ఈ తరహా డ్రై ప్రమోషన్ల రేటు 8 శాతం ఉండేది. అయితే ఇప్పుడది 13 శాతానికి పెరిగింది. దీంతోపాటు చాలా కంపెనీలు ప్రమోషన్లకు కేటాయిస్తున్న బడ్జెట్‌ను కూడా తగ్గిస్తూ వస్తున్నాయట. ఉద్యోగుల లేమి, బడ్జెట్ లేకపోవడం వంటి కారణాల వల్ల ఉన్న ఉద్యోగులకే శాలరీ హైక్ లేకుండా అదనపు బాధ్యతలు అప్పగించాల్సి వస్తుందని కంపెనీలు పేర్కొంటున్నాయి.
డ్రై ప్రమోషన్ ట్రెండ్ గురించి సోషల్ మీడియాలో కూడా పలు పోస్ట్‌లు వస్తున్నాయి. హోదా, టైటిల్ పెరగడం వల్ల మాకేంటి ఉపయోగం అంటూ కొందరు ఉద్యోగులు ఫన్నీగా మీమ్స్ చేస్తున్నారు.