US Fed- Sensex | ఫెడ్ రిజర్వ్ సంకేతాలు.. రూ.4 లక్షల కోట్లు పుంజుకున్న ఇన్వస్టర్ల కిట్టి..!
US Fed- Sensex | గురువారం ఉదయం ట్రేడింగ్‌లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా పుంజుకోగా, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 0.8 శాతం లాభంతో సాగుతున్నది.
US Fed- Sensex | కీలక వడ్డీరేట్లలో జూన్‌లో కోత విధిస్తామని యూఎస్ ఫెడ్ రిజర్వ్ జెరోమ్ పావెల్ సంకేతాలు ఇవ్వడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలోపేతమైంది. గురువారం ఉదయం ట్రేడింగ్‌లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా పుంజుకోగా, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 0.8 శాతం లాభంతో సాగుతున్నది. అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. తత్ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.32 లక్షల కోట్లు పెరిగి రూ.378.44 లక్షల కోట్లకు చేరుకున్నది. ఇప్పటికీ అమెరికా ద్రవ్యోల్బణం ఆందోళనకరంగా కొనసాగుతుదని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ చెప్పారు. ధరల ఒత్తిళ్లు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయని, మున్ముందు వడ్డీరేట్లు తగ్గించాలన్న నిర్ణయాన్ని పునరుద్ఘాటించారు.
ఈ ఏడాది మూడుసార్లు వడ్డీరేట్లు తగ్గిస్తామని ఫెడ్ రిజర్వ్ సంకేతాలివ్వడంతో ఎల్టీటీఎస్, కోఫోర్జ్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ సారధ్యంలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఒక శాతానికి పైగా పుంజుకున్నది. నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ ఫైనాన్సియల్, మీడియా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లు ఒక శాతానికి పైగా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. దేశీయ ఇన్వెస్టర్లు బుధవారం రూ.2,668 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేస్తే, విదేశీ పెట్టుబడిదారులు సుమారు రూ.2600 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
ద్రవ్యోల్బణం అంచనాలకు అనుగుణంగా వడ్డీరేట్లను 5.5 శాతం నుంచి 5.25 శాతానికి యూఎస్ ఫెడ్ రిజర్వ్ ప్రకటించింది. గత డిసెంబర్ నుంచి వడ్డీరేట్లు తగ్గించలేదు. ఈ ఏడాది మూడు దఫాలుగా 25 బేసిక్ పాయింట్ల చొప్పున తగ్గిస్తామని పేర్కొంది. ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకరంగా ఉండటం ధరల ఒత్తిళ్లను తెలియజేస్తుందని ఫెడ్ చైర్‌మన్ జెరోమ్ పావెల్ తెలిపారు. అయితే నెమ్మదిగా ద్రవ్యోల్బణం దిగి వస్తుందన్నారు. న్యూయార్క్‌లో యూఎస్ ట్రెజరీ బాండ్లు స్వల్పంగా నష్టపోతే, ఆసియాలో స్థిరంగా ఉన్నాయి. రెండేండ్ల గడువు గల బాండ్లు 4.59 శాతం, 10 ఏండ్ల బాండ్లు 4.26 శాతం నష్టపోయాయి. అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ 12 పైసలు పెరిగి రూ.83.06 వద్ద నిలిచింది.