UPI Payments | ఫీజు వసూలు చేస్తే 70శాతం మంది యూపీఐకి గుడ్‌బై.. తేల్చేసిన లోకల్ సర్కిల్స్ సర్వే..!
UPI Payments | గత 12 ఏండ్లలో డిజిటల్ చెల్లింపులు దాదాపు 90 రెట్లు పెరిగాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.
UPI Payments | ఇప్పుడు దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులన్నీ యూపీఐ ద్వారా మాత్రమే జరుగుతున్నాయి. గతంతో పోలిస్తే మొత్తం డిజిటల్ పేమెంట్స్‌లో 80 శాతం యూపీఐ ఆధారిత చెల్లింపులే ఉన్నాయి. దాదాపుగా ప్రతి ఒక్కరూ యూపీఐ ఆధారిత చెల్లింపులు జరుపుతుండటంతో క్రమంగా ఆయా యూపీఐ పేమెంట్స్ మీద ఫీజు వసూలు చేయాలన్న ప్రతిపాదనలు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీఐ చెల్లింపులపై ఫీజు వసూలు చేస్తే యూపీఐ ఆధారిత యాప్స్ వినియోగం నిలిపివేస్తామని ప్రతి పది మంది యూపీఐ యూజర్లలో ఏడుగురు చెప్పారు. లోకల్ సర్కిల్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో 34 వేల మంది పాల్గొన్నారు.
గతేడాది ఫిబ్రవరిలో రూ.12 లక్షల కోట్ల పై చిలుకు యూపీఐ లావాదేవీలు నిర్వహిస్తే, 2024 ఫిబ్రవరిలో రూ.16 లక్షల కోట్లకు పైగా జరిగాయి. ప్రతి యూపీఐ లావాదేవీపై రూ.20 చొప్పున వసూలు చేయాలని యూపీఐ మాతృసంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రతిపాదించింది. యూపీఐ లావాదేవీల్లో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఫిన్‌టెక్ సంస్థలు కోరాయి. యూపీఐ లావాదేవీలతో తమకు ఎటువంటి ఆదాయం రావడం లేదని ఫిన్‌టెక్ సంస్థలు అభిప్రాయ పడుతున్నాయి. వివిధ రకాల పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ ప్రాసెసింగ్ మీద ఎండీఆర్ అమలవుతున్నదని లోకల్ సర్కిల్స్ సర్వే తెలిపింది.
వివిధ బాండ్ల యూపీఐ లావాదేవీలపై చార్జీలు వసూలు చేసేందుకు 2022 ఆగస్టులో ఆర్బీఐ అధ్యయన పత్రం విడుదల చేసింది. కానీ, దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ స్పందించి.. యూపీఐ లావాదేవీలపై ఎటువంటి కన్వీనియన్స్ ఫీజు వసూలు చేసే ప్రతిపాదన లేదని వివరణ ఇచ్చింది. మర్చంట్ల నుంచి యూపీఐ లావాదేవీల ఫీజు వసూలు చేస్తే అది చివరకు వినియోగదారుడిపైనే పడుతుందని లోకల్ సర్కిల్స్ నివేదిక తెలిపింది.
గత 12 ఏండ్లలో డిజిటల్ చెల్లింపులు దాదాపు 90 రెట్లు పెరిగాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ప్రపంచవ్యాప్త డిజిటల్ పేమెంట్స్‌లో భారత్‌లోనే సుమారు 49 శాతం జరుగుతున్నాయని సోమవారం ఓ సదస్సులో మాట్లాడుతూ చెప్పారు. 2017లో 43 కోట్ల లావాదేవీలు జరిగితే 2023 కల్లా అది 11,761 కోట్లకు చేరింది. ప్రతి రోజూ సరాసరి 43 కోట్ల యూపీఐ పేమెంట్ లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రపంచ దేశాల్లోనే వేగవంతమైన చెల్లింపుల వ్యవస్థగా యూపీఐ నిలిచిందని తెలిపారు.
ఆదాయం పన్ను మొదలు బీమా ప్రీమియం, మ్యూచువల్ ఫండ్స్, ఈ-కామర్స్ చెల్లింపులకు అత్యధికులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తారు. వీటి ప్రాసెసింగ్ కోసం వేర్వేరు పేమెంట్స్ అగ్రిగేటర్లతో బ్యాంకులు విడివిడిగా ఒప్పందాలు చేసుకోవాలి. ఈ తరహా చెల్లింపుల కోసం బ్యాంకులు, పేమెంట్స్ అగ్రిగేటర్ల మధ్య ఒప్పందం ఉండాలి. అలాగే, అన్ని లావాదేవీలకు వేర్వేరు ఒప్పందాలు చేసుకోవడం అసాధ్యం అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణ కోసం ఇంటరాపరేబుల్ పేమెంట్స్ సిస్టమ్ తేవడానికి కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు.