Jimny Vs Thar | బ్రెజా.. ఫ్రాంక్స్ వెలుగు వెలిగినా..మారుతికి మహీంద్రా థార్ హాల్ట్..!
Jimny Vs Thar | రోజురోజుకి ఎస్‌యూవీ కార్ల విక్రయాలు పుంజుకుంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఎస్‌యూవీ కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి తన పట్టు కొనసాగించింది.
Jimny Vs Thar | రోజురోజుకి ఎస్‌యూవీ కార్ల విక్రయాలు పుంజుకుంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఎస్‌యూవీ కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి తన పట్టు కొనసాగించింది. బ్రెజా, ఫ్రాంక్స్ వంటి మోడల్ కార్ల మద్దతుతో ఏప్రిల్ నెలలో దాదాపు 40 వేల ఎస్‌యూవీ కార్లను విక్రయించింది మారుతి సుజుకి. గ్రాండ్ విటారా అంచనాల కంటే తక్కువ సేల్స్ జరిగాయి. జిమ్నీ సైతం తక్కువ యూనిట్లే విక్రయించింది. 2023 ఏప్రిల్‌తో పోలిస్తే 2024 ఏప్రిల్‌లో మారుతి ఎస్‌యూవీ కార్ల విక్రయాలు 28,400 నుంచి 39,307 యూనిట్లకు పెరిగి 38.4 శాతం వృద్ధిరేటు నమోదు చేసుకున్నది. వాటిల్లో బ్రెజా 17,113, ఫ్రాంక్స్ 14,286 యూనిట్లు అమ్ముడయ్యాయి.
మారుతి గ్రాండ్ విటారా నెలవారీగా 2023-24లో 10 వేలకు పైగా యూనిట్లు అమ్ముడైతే, ఏప్రిల్‌లో 7,651 యూనిట్లకే పరిమితమైంది. ఎన్నో ఆశలతో మారుతి ఆవిష్కరించిన ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ జిమ్నీ.. అంచనాలను తలకిందులు చేసింది. కేవలం 257 జిమ్నీ యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
మారుతి సుజుకి బ్రెజా కారు రూ.8.34 లక్షల నుంచి రూ.14.14 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ రూ.7.51 లక్షల నుంచి రూ.13.03 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది. మారుతి సుజుకి ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ కారు గ్రాండ్ విటారా ధర రూ.10.99 లక్షలకు మొదలై రూ.20.09 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది.
ఇక ఆఫ్ రోడర్ ఎస్‌యూవీ జిమ్నీ కారు ధర రూ.12.74 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.14.95 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది.సమర్థమంతమైందిగా, దృఢమైందిగా పేరొందినా ఆఫ్‌రోడర్ ఎస్‌యూవీ జిమ్నీ కారు ధర కస్టమర్లను ఆందోళనకు గురి చేస్తుందని డీలర్ల కథనం. జిమ్నీ కారు ధరతో పోలిస్తే దాని ప్రత్యర్థి మహీంద్రా అండ్ మహీంద్రా ఆఫ్ రోడర్ ఎస్‌యూవీ థార్ వైపు మొగ్గుతున్నారు.
మహీంద్రా థార్ ధర రూ.11.25 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.17.60 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది. 2023-24లో సగటున నెలవారీగా మహీంద్రా థార్ కార్ల విక్రయాలు 5,400 చొప్పున జరిగాయి. ఏప్రిల్‌లో 6,100 యూనిట్లకు పైగా థార్ విక్రయాలు జరిగాయి. మస్క్యులర్ డిజైన్, స్ట్రాంగ్ రోడ్ ప్రెజెన్స్, మల్టీఫుల్ పవర్ ట్రైన్ ఆప్షన్లతో మహీంద్రా థార్ వస్తోంది.