ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం
టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్
రానున్న ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ముందున్న లక్ష్యమని టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతోన్న వేళ ఆయన ఇయర్ ఎండ్ నోట్ రిలీజ్ చేశారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయంగా అనేక అస్థిర పరిస్థితులు నెలకొన్నాయని.. అవి ప్రపంచ ముఖచిత్రాన్నే మార్చేశాయని తెలిపారు. ఉక్రెయిన్, గాజా, సూడన్‌లో యద్ధ వాతావరణం, బంగ్లాదేశ్, దక్షిణ కొరియాలో ప్రజా ఆందోళనల గురించి ఆయన ప్రస్తావించారు. రానున్న రోజుల్లో ఇమ్మిగ్రేషన్, టెక్నాలజీ, కామర్స్ తదితర రంగాల్లో సవాళ్లు తప్పవని తెలిపారు. టాటా గ్రూప్ వ్యాపార ముఖచిత్రాన్ని రతన్ టాటా సమూలంగా మార్చేశారని, ఆయన ఈ ఏడాది దూరం కావడం అందరికీ బాధకరమని తెలిపారు. ఆయన లేని లోటు పూడ్చలేదని పేర్కొన్నారు. దేశంలోనే తొలి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ను 2024లోనే ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. సీ295 ఎయిర్‌క్రాఫ్ట్ ఫైనల్ అసెంబ్లీ ప్లాంట్ సహా ఏడు తయారీ యూనిట్లను ఈ ఏడాదే ప్రారంభించడం సంతోషకమని తెలిపారు. ఈ ఏడాదే ఎయిర్ ఇండియా, విస్తారా సంస్థలు విలీనమయ్యాయని తెలిపారు. బ్యాటరీలు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రిక్ వెహికిల్స్, సోలార్ వంటి రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించబోతున్నామని తెలిపారు.