Tesla - Elon Musk | భారత్‌లోకి టెస్లా ఈవీ కార్ల ఎంట్రీ పక్కా.. తేల్చేసిన ఎలన్‌మస్క్..!
Tesla - Elon Musk | కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా ఎలన్ మస్క్ (Elon Musk) సారధ్యంలోని గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత్ మార్కెట్‌లోకి అడుగు పెట్టడం ఖాయమైంది.
Tesla - Elon Musk | కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా ఎలన్ మస్క్ (Elon Musk) సారధ్యంలోని గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత్ మార్కెట్‌లోకి అడుగు పెట్టడం ఖాయమైంది. భారతీయులకు టెస్లా ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి తేవడానికి కసరత్తు సాగుతున్నదని ఎలన్‌మస్క్ సోమవారం స్వయంగా సంకేతాలిచ్చారు. భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనువైన ప్రదేశం కోసం సంస్థ ప్రతినిధులు అన్వేషిస్తున్న వేళ ఎలన్‌మస్క్ (Elon Musk) ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. టెస్లా మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు ఆకర్షణీయ ఆఫర్లు ప్రతిపాదించాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో టెస్లా యూనిట్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ ప్రతినిధులతో చర్చిస్తున్నట్లు వార్తలొచ్చాయి.
జాతీయ, అంతర్జాతీయ డిమాండ్‌కు అనుగుణంగా కార్ల ఉత్పత్తికి మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి 200-300 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాలని టెస్లా యాజమాన్యం తల పోస్తున్నది. భారత్‌లోకి టెస్లా వచ్చేందుకు మార్గం సుగమం చేస్తూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కూడా నూతన ఈవీ పాలసీ ప్రకటించింది. అత్యాధునిక టెక్నాలజీ, పలు కీలకాంశాలతో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పాదక కేంద్రంగా భారత్‌కు ప్రాధాన్యం ఇస్తూ పెట్టుబడులు పెట్టాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తున్నది. మేక్ ఇన్ ఇండియా ఇన్షియేటివ్‌ను ప్రోత్సహించడంతోపాటు భారత కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా అత్యాధునిక ఈవీ టెక్నాలజీతో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈవీ కార్ల తయారీ దారుల నుంచి పెట్టుబడులు ఆకర్షించడమే కేంద్ర ప్రభుత్వ నూతన ఈవీ పాలసీ ప్రధాన లక్ష్యం.
భారత్‌లో ఈవీ కార్ల తయారీ సంస్థలు కనీసం రూ.4,150 కోట్ల (సుమారు 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటది. మూడేండ్లలోపు కార్లలో వినియోగించే విడి భాగాల్లో కనీసం 25 శాతం దేశీయంగా తయారు చేయాలన్నది ప్రభుత్వ నిబంధన. ఐదేండ్లు పూర్తయ్యే సరికి స్థానికంగా 50 శాతం కార్ల తయారీ పూర్తి కావాల్సి ఉంటది.
కేంద్ర ప్రభుత్వ విధానానికి లోబడి దేశంలో పెట్టుబడులు పెట్టే ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థలు దిగుమతి చేసే కార్లలో 35 వేల డాలర్లు, అంతకంటే ఎక్కువ ధర పలికే వాటిపై ఐదేండ్లపాటు 15 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తారు. మూడేండ్లలోపు కార్ల తయారీదారు భారత్‌లో మాన్యుఫాక్చరింగ్ వసతులు నిర్మిస్తే ఈ నిబంధన వర్తిస్తుంది. దేశంలో సంబంధిత సంస్థ పెట్టుబడులు లేదా రూ.6,484 కోట్ల మేరకు పెడితే దిగుమతి చేసుకునే కార్ల సంఖ్యను నిర్దేశిస్తారు. ఉదాహరణకు 800 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడితే 40వేల ఈవీ కార్ల దిగుమతికి అనుమతి ఇస్తారు. కార్ల దిగుమతి పరిమితులను భవిష్యత్ పరిస్థితులను బట్టి ఖరారు చేస్తారు.
భారత్ మార్కెట్‌లోకి టెస్లా ఎంటర్ కావడంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంతోపాటు పర్యావరణ పరిరక్షణకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. దేశీయంగా మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయడంతో యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఆర్థిక వృద్ధిరేటుకు ప్రోత్సాహకరంగా ఉండటంతోపాటు పర్యావరణ వ్యవస్థ బలోపేతానికి మార్గం సుగమం అవుతుంది.