Tesla Cars Recall | రెండు లక్షల టెస్లా కార్లు రీకాల్.. కారణమిదేనా..?!
Tesla Cars Recall | 2023లో మార్కెట్‌లోకి టెస్లా (Tesla) విడుదల చేసిన వై (Y), ఎస్ (S), ఎక్స్ (X) మోడల్ కార్లే రీకాల్ చేస్తున్నవాటిలో ఉన్నాయి.
Tesla Cars Recall | ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) కీలక నిర్ణయం తీసుకున్నది. అమెరికాలో దాదాపు రెండు లక్షల యూనిట్లు రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. కారు రివర్స్ చేస్తున్నప్పుడు బ్యాకప్ కెమెరా సిస్టమ్ పని చేయడం లేదని, సాంకేతిక లోపం తలెత్తిందని కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో టెస్లా ఈ నిర్ణయం తసుకున్నది. 2023లో మార్కెట్‌లోకి టెస్లా (Tesla) విడుదల చేసిన వై (Y), ఎస్ (S), ఎక్స్ (X) మోడల్ కార్లే రీకాల్ చేస్తున్నవాటిలో ఉన్నాయి. వీటిల్లో ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కంప్యూటర్ 4.0 పని చేస్తున్న 2023.44.30 సాఫ్ట్‌వేర్ వర్షన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.
యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (US National Highway Traffic Safety Administration) దర్యాప్తు ప్రకారం కారు రివర్స్ చేస్తున్నప్పుడు బ్యాకప్ కెమెరా ఇమేజ్‌లు డిస్‌ప్లే చేయడంలో సాఫ్ట్‌వేర్ అస్థిరంగా వ్యవహరిస్తున్నదని తేలింది. దీనివల్ల ఇతర వాహనాలతో కొల్లిషన్ అయ్యే ముప్పు పొంచి ఉందని టెస్లాను యూఎస్ ఎన్‌హెచ్‌టీఎస్ఏ హెచ్చరించింది.
అయితే, ఇప్పటివరకు తమ కార్లు క్రాష్ అయినట్లు గానీ, అందులో ప్రయాణికులు గాయపడిన ఘటనలు తమ దృష్టికి రాలేదని టెస్లా ఇంక్ తెలిపింది. ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా సమస్యను సరి చేస్తామని యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కు నివేదించినట్లు సమాచారం. ఇలా సాఫ్ట్‌వేర్ సమస్య ఎదుర్కొంటున్నకార్ల యజమానులకు మార్చి 22 నుంచి నోటిఫికేషన్ లేఖలు అందుతాయని టెస్లా తెలిపింది. గత నెల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, ఈ నెల 22 నాటికి ఇదే సాంకేతిక సమస్యపై తమకు 81 వారంటీ క్లయిమ్‌లు వచ్చాయని వెల్లడించింది. ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్ ఉన్నా, టెస్లా కార్లకు ఆటోమేటిక్ డ్రైవింగ్ సామర్థ్యం లేదు. కారు నడిపేందుకు అన్ని వేళల్లో డ్రైవర్లు తప్పనిసరిగా జోక్యం చేసుకోవాల్సిందేనని తెలుస్తోంది.
ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓగా ఎలన్‌మస్క్ ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత కుబేరుడి స్థానంలో కొనసాగుతున్న ఎలన్‌మస్క్.. భారత్ మార్కెట్‌లోకి ఎంటర్ కావడానికి సిద్ధం అవుతున్నారు. తొలుత భారత్ మార్కెట్‌లోకి టెస్లా కారు దిగుమతి చేసుకున్న తర్వాత రెండేండ్లలో దేశీయంగా టెస్లా కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతున్నది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాల్లో రాయితీలు కల్పించే అవకాశాలు పరిశీలిస్తున్నది.