TCS Market Capitalisation | యూరప్ కంపెనీతో డీల్.. ఆల్‌టైం గరిష్టానికి టీసీఎస్.. కంపెనీ ఎం-క్యాప్ తొలి రికార్డు.. అదేమిటంటే..?!
TCS Market Capitalisation | మంగళవారం ట్రేడింగ్‌లో టీసీఎస్ షేర్లు నాలుగు శాతం పుంజుకుని రూ.4,135 వద్దకు చేరాయి.
TCS Market Capitalisation | టాటా సన్స్ అనుబంధ సంస్థ.. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మంగళవారం (2024 ఫిబ్రవరి 6)న దేశీయ స్టాక్ మార్కెట్లలో చారిత్రక మైలురాయిని దాటేసింది. స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌లో టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15 లక్షల కోట్లకు చేరుకున్నది. టీసీఎస్ చరిత్రలో రూ.15 లక్షల కోట్ల ఎం-క్యాప్ మార్క్‌ను దాటడం ఇదే తొలిసారి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లోని లిస్టెడ్ కంపెనీల్లో టీసీఎస్ అత్యంత విలువైన భారత కంపెనీగా నిలిచింది.
మంగళవారం ట్రేడింగ్‌లో టీసీఎస్ షేర్లు నాలుగు శాతం పుంజుకుని రూ.4,135 వద్దకు చేరాయి. ఇంతకుముందు సెషన్‌లో రూ.4,043 వద్ద నిలిచింది. 12 నెలల తర్వాత టీసీఎస్ స్క్రిప్ట్ పుంజుకోవడం ఇదే తొలిసారి. గత అక్టోబర్‌లో రూ.2,926 వద్ద ఆల్‌టైం కనిష్ట స్థాయి వద్ద ట్రేడయిన టీసీఎస్ షేర్.. తదుపరి షార్ప్ రికవరీ సాధించి దాదాపు 40 శాతం వృద్ధి చెందింది. టీసీఎస్ స్టాక్ ఆల్‌టైం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15.13 లక్షల కోట్ల మార్క్‌ను దాటేసింది.
గ్లోబల్ లీడింగ్ అసిస్టెన్స్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీ `యూరోప్ అసిస్టెన్స్`తో కొత్త డీల్ కుదుర్చుకున్నట్లు ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో సోమవారం టీసీఎస్ ప్రకటించడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలోపేతమైంది. తద్వారా గ్లోబల్ ఐటీ ఆపరేటింగ్ మోడల్‌గా టీసీఎస్ ఇమేజ్ పుంజుకున్నది. యూరప్ దేశాల్లో డెలివరీ సెంటర్లు గల యూరోప్ అసిస్టెన్స్ సంస్థతో ఐటీ అప్లికేషన్ సర్వీసెస్ డీల్ కుదుర్చుకున్నాం అని టీసీఎస్ ప్రకటించింది. యూరోప్ అసిస్టెన్స్ ఐటీ ఆపరేషన్స్ పరివర్తనలో టీసీఎస్ ఏఐ ప్లాట్‌ఫామ్, ఇగ్నో ఏఐ ఆప్స్ ఉపకరిస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టూల్స్‌తో యూరోప్ అసిస్టెన్స్ సంస్థలో ఉత్పాదక మెరుగుదలకు కృషి చేస్తామని టీసీఎస్ వెల్లడించింది.
బ్రిటన్ అగ్రశ్రేణి బీమా, వెల్త్ అండ్ రిటైర్‌మెంట్ సర్వీసుల సంస్థ అవీవాతో 15 ఏండ్ల భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. టీసీఎస్ బీఏఎన్సీఎస్ బేస్డ్ ప్లాట్‌ఫామ్ సాయంతో అవీవా లైఫ్ బిజినెస్ పరివర్తనకు దోహద పడుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం 2.48 శాతం తగ్గింది. జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో సంస్థ నికర లాభం రూ.11,380 కోట్లతో పోలిస్తే తృతీయ త్రైమాసికంలో 2.48 శాతం క్షీణించి.. రూ.11,097 కోట్లకు పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నికర లాభాల్లో రెండు శాతం మెరుగుదల కనిపించింది. 2022-23 తృతీయ త్రైమాసికంలో నికర లాభం రూ.10,883 కోట్లుగా నిలిచింది. ఒక లీగల్ క్లయిమ్ సెటిల్‌మెంట్ కోసం వన్‌టైం చార్జి రూపంలో రూ.958 కోట్లు ఖర్చు చేయడంతో డిసెంబర్ త్రైమాసికంలో నికర లాభం తగ్గడానికి మరో కారణం.
టీసీఎస్‌తోపాటు దూసుకెళ్తున్న టాటా సంస్థలు ఇవే..
ఇటీవలి కాలంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)తోపాటు టాటా సన్స్ గ్రూప్ సంస్థలు దూసుకెళ్తున్నాయి. టాటా మోటార్స్ 2023 ముగిసిన తర్వాత నిఫ్టీ-50 స్టాక్స్‌లో 101 శాతం పుంజుకున్నది. 2023-24లోనూ మెరుగుదలతో దాదాపు 20 శాతం స్ఫూర్తిదాయక రిటర్న్స్ సాధించింది. టాటా మోటార్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇటీవల రూ.3 లక్షల కోట్ల మార్క్‌ను దాటేసింది. ఏడేండ్ల తర్వాత దేశంలోనే అత్యంత విలువైన ఆటోమొబైల్ కంపెనీగా టాటా మోటార్స్ తొలిసారి నిలిచింది. టీసీఎస్, టాటా మోటార్స్ సంస్థలతోపాటు ట్రెంట్, టైటాన్, టాటా పవర్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ వంటి సంస్థలు ఏడాది కాలంలో రూ.లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నాయి.