రూ.6 లక్షల కోట్లు హాంఫట్
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం ఒక్క రోజే రూ.6 లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో సెన్సెక్స్ ఒకానొక దశలో 1,500 పాయింట్లు కోల్పోగా ఆ తర్వాత కాస్త కోలుకుంది. సెన్సెక్స్ 941.88 పాయింట్లు నష్టపోయి 78,232.60 పాయింట్ల వద్ద, నిఫ్టీ 309 పాయింట్లు నష్టపోయి 23,995.35 పాయింట్ల వద్ద ముగిశాయి. మహీంద్ర అండ్ మహీంద్ర, టెక్ మహీంద్ర, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్ మినహా మిగతా అన్ని షేర్లు నష్టపోయాయి. అదానీ పోర్ట్స్, రిలయన్స్, సన్ ఫార్మా, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు ఎక్కువ నష్టాలు మూటగట్టుకున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.6 లక్షల కోట్లు ఆవిరి అయ్యాయి. మంగళవారం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల ప్రభావం ప్రపంచంలోని అన్ని స్టాక్ మార్కెట్లపైనా చూపింది. ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో ముడిచమురు ధరలు క్రమేణ పెరుగుతున్నాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 75 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. రూపాయి ఆల్ టైం పతనమైంది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.84.11 లుగా ఉంది.