రెండో రోజూ స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మరింత క్షీణించిన రూపాయి విలువ
భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవగా బుధవారం కాస్త కోలుకున్నాయి. గురువారం కూడా మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. గురువారం ఉదయం 76,414.52 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ట్రేడింగ్ కాసేపటికే అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒకానొక దశలో 76,202.12 పాయింట్ల కనిష్టానికి చేరుకుంది. మధ్యాహ్నం తర్వాత 76,743.54 పాయింట్ల గరిష్టానికి చేరుకుంది. చివరికి 115 పాయింట్ల లాభంతో 76,520.38 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 23,205.35 పాయింట్ల వద్ద ముగిసింది. టాటా స్టీల్స్, టాటా మోటార్స్, టెక్ మహీంద్ర, జొమాటో, ఎం అండ్ ఎం. సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ షేర్లు లాభాలు దక్కించుకన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ, కోటక్ మహీంద్ర బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టపోయాయి. రెండు రోజుల పాటు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆశాజనకంగా కనిపించగా గురువారం 14 పైసలు కోల్పోయి రూ.86.47 వద్ద ముగిసింది.