స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
ఈ వారంలో వెలువడబోయే ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టి సారించిన మదుపర్లు అప్రమత్తత
దేశీయ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ మిశ్రమ సంకేతాలకు తోడు.. ఈ వారంలో వెలువడబోయే ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టి సారించిన మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. మరోవైపు, మార్కెట్లను భారీగా ప్రభావితం చేసే వార్తలు ఏమీ లేకపోవడమూ సూచీల నష్టాలకు కారణమైంది. ఉదయం 10 గంటలకు సెన్సెక్స్ 41.47 పాయింట్లు కోల్పోయి 79,527 వద్ద, నిఫ్టీ 11.65 పాయింట్ల నష్టంతో 24,159 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా పతనమవుతున్నది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో రూపాయి విలువ 84.38 వద్ద జీవనకాల కనిష్టానికి పడిపోయింది.
ఈ నెల 12న రిటైల్ ద్రబ్యోల్బణం, ఐఐపీ గణాంకాలు, 14న టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్నాయి. అటు 13న వెలువడే అమెరికా ద్రవ్యోల్బణ వివరాలపైనా మదుపర్లు దృష్టి పెట్టారు. దేశీయంగా కంపెనీల ఫలితాల్లో స్తబ్దత, భవిష్యత్తు అంచనాలు నిరాశజనకంగా ఉండటం, మార్కెట్లు ఈ వారం ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉన్నదని నిపుణులు అంచనా వేశారు.
నిఫ్టీలో మారుతి సుజుకీ, బ్రిటానియా, టాటా మోటార్స్, సిప్లా, ఎస్‌బీఐ షేర్లు రాణిస్తుండగా.. ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. ఏషియన్ పెయింట్స్ షేర్లు 7 శాతానికి పైగా కుంగాయి.