Small Cap Returns | మనీ మేకింగ్ మంత్ర.. 2023-24లో స్మాల్ క్యాప్ ఇన్వెస్టర్లకు జాక్‌పాట్.. ఇవీ డిటైల్స్..!
Small Cap Returns | ప్రతి ఒక్కరూ తమ కుటుంబ భవిష్యత్ అవసరాల కోసం తమ సంపాదనలో కొంత మొత్తం పన్ను ఆదా పథకాలు, బంగారం, రియల్ ఎస్టేట్ రంగాల్లో మదుపు చేస్తుంటారు.
Small Cap Returns | ప్రతి ఒక్కరూ తమ కుటుంబ భవిష్యత్ అవసరాల కోసం తమ సంపాదనలో కొంత మొత్తం పన్ను ఆదా పథకాలు, బంగారం, రియల్ ఎస్టేట్ రంగాల్లో మదుపు చేస్తుంటారు. మరికొందరు స్టాక్‌మార్కెట్లలోనూ పెట్టుబడులు పెడుతుంటారు. స్టాక్ మార్కెట్‌లు అంటేనే రిస్కీ.. ఎప్పుడు ఏ రాజకీయ, ఆర్థిక సమస్య ముంచుకువస్తుందో చెప్పలేని అయోమయ పరిస్థితి. కానీ, కొవిడ్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ప్రత్యేకించి 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డులు నెలకొల్పాయి. అప్పుడప్పుడూ స్టాక్ మార్కెట్లలో ఇండెక్స్‌లు భారీగా పతనం అవుతున్నా.. మొత్తంగా ఇన్వెస్టర్లకు లాభాలు వడ్డించాయనే చెప్పాలి. ఇక ఖర్చు, కష్టంతో కూడుకున్నదైనా ఈ ఏడాది స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ బ్యూటిఫుల్ అని నిపుణులు చెబుతున్నారు.
స్మాల్ క్యాప్ ఇన్వెస్టర్లు అంటే మనీ మేకింగ్ మంత్ర పాటించే రిటైల్ ఇన్వెస్టర్లు శరవేగంగా పెరిగిపోయారు. వారికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.26 లక్షల కోట్ల లాభాలు గడించి పెట్టాయి. ఎప్పటికప్పుడు మ్యూచువల్ ఫండ్స్ నిర్వాహక సంస్థల నుంచి హెచ్చరికలు వచ్చినా ఈ ఏడాది బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లోని 1000 క్యాప్స్ రూ.26 లక్షల కోట్లు పెరిగి రూ.66 లక్షల కోట్లకు పెరిగాయి. 1000 స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో 252 స్క్రిప్ట్‌లు.. అంటే ప్రతి నాలుగింట్లో ఒక స్టాక్.. ఇన్వెస్టర్‌కు మల్టీబాగర్ రిటర్న్స్ అందించాయి. కేవలం 124 స్టాక్స్ మాత్రమే ప్రతికూల లాభాలతో సరిపెట్టుకున్నాయి.
స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లోని సంస్థల్లో జై బాలాజీ ఇండస్ట్రీస్ 1878 శాతం, వారే రెన్యూవబుల్ టెక్నాలజీస్ 810 శాతం, ఫోర్స్ మోటార్స్ 522%, ఐనాక్స్ వైండ్ 441%, సుజ్లాన్ ఎనర్జీ 369%, కల్యాణ్ జ్యువెల్లర్స్ 281 శాతం లాభాలు గడించాయి. ఇక ఇర్కాన్ ఇంటర్నేషనల్, జుపిటర్ వ్యాగన్స్, ఆర్వీఎన్ఎల్, కొచిన్ షిప్‌యార్డ్, టిటాగఢ్ రైల్ సిస్టమ్స్, పీటీసీ ఇండస్ట్రీస్, మ్యాగజైన్ డాక్ షిప్ బిల్డర్స్ వంటి రక్షణశాఖ, రైల్వేశాఖ అనుబంధ స్టాక్స్ కూడా ఇన్వెస్టర్లకు మల్టీ బాగర్ రిటర్న్స్ అందించాయి. మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ ఇండెక్స్‌ల్లో పెట్టుబడులపై స్టాక్ మార్కెట్ల రెగ్యులేటర్ సెబీ హెచ్చరించినట్లే, గత నెలలో బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 6.5 శాతం నష్టపోయింది. 2018లో ప్రత్యేకించి జనవరి-అక్టోబర్ మధ్య స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 24 నుంచి 31 శాతం మధ్య నష్టపోయాయి.
ఇటీవలి పతనం మాటలెలా ఉన్నా, బుల్ పరుగులు తీస్తుండటంతో గత ఏడాది కాలంగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 61 శాతం లాభాల్లోనే ప్రయాణించింది. 2018 తర్వాత తొలిసారి 2023-24లో మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు 30, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లు 37, లార్జ్ క్యాప్ స్టాక్స్ 16 శాతం లాభాలు సంపాదించి పెట్టాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మధ్యకాలికంగా స్మాల్ క్యాప్ స్టాక్స్ మంచి లాభాలు సాధించి పెడతాయని అంటున్నారు. బీఎస్ఈతో పోలిస్తే ఎన్ఎస్ఈ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ గణనీయంగా తక్కువగా ట్రేడ్ అయ్యాయని ఆనంద్ రాఠీ రీసెర్చ్ అనలిస్ట్ శ్వేత జైన్ చెప్పారు. మున్ముందు స్టాక్ మార్కెట్లలో సర్దుబాట్లు తప్పవని, ఇన్వెస్టర్లు కీలక దశలో స్టాక్స్ విక్రయించడం బెటర్ అంటున్నారు.