భారీగా పతనమైన అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు
న్యూయార్క్ లో ఆదానీపై కేసు.. రూ.2 లక్షల కోట్లకు పైగా సంపద కోల్పోయిన ఆదానీ గ్రూప్
స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనమవుతున్నాయి. అత్యధికంగా అదానీ ఎనర్జీ సొల్యుషన్స్ షేరు 20 శాతం వరకు విలువ కోల్పోయింది. ఓ భారీ కాంట్రాక్టు పొందడానికి 265 మిలియన్ డాలర్ల (రూ. 2,029) లంచాలు ఇవ్వజూపినట్లు అమెరికాలోని బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపడం దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ బ్రియాన్ పీస్ ఆదేశాల మేరకు మొత్తం ఐదు అభియోగాలతో గౌతమ్ అదానీ సహా ఏడుగురిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
అదానీ గ్రూప్‌లోని పలు కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఏసీసీ 10 శాతం, అదానీ ఎనర్జీ సొల్యుషన్స్ 20 శాతం, అదానీ ఎంటర్ ప్రైజెస్ 20 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 18 శాతం, అదానీ పోర్ట్స్ 15 శాతం, అదానీ పవర్ 14 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 15 శాతం, అదానీ విల్మార్ 10 శాతం, అదానీ సిమెంట్స్ 12 శాతం నష్టపోయాయి. మొత్తంగా గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 14.28 లక్షల కోట్ల నుంచి 12.42 లక్షల కోట్లకు పడిపోయినట్లు ఫార్చ్యూన్ కథనంలో పేర్కొన్నది. ఈ గ్రూప్‌లో పెట్టుబడిదారు అయిన అమెరికాకు చెందిన జీక్యూజీ పార్టనర్స్ షేర్లూ 25 శాతం కుంగినట్లు సీఎన్‌బీసీ పేర్కొన్నది.
అదానీ, దాని అనుబంధ సంస్థలు 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందడానికి భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లు లంచాలు చెల్లించినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అనంతరం అమెరికా, అంతర్జాతీయ మదుపర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సమీకరించడానికి కంపెనీ యత్నించినట్లు పేర్కొన్నది. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా.. ఆ కంపెనీ రుణ దాతలు, పెట్టుబడిదారుల నుంచి 3 బిలియన్ డాలర్లకుపైగా రుణాలు, బాండ్లను సేకరించిందని ఆరోపిస్తూ న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. ఇప్పుడు ఈ వ్యవహారం సంచలనంగా మారింది.