Telugu Global
Business

సెన్సెక్స్‌ 1000+ ..24 వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ

భారీ లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

సెన్సెక్స్‌ 1000+ ..24 వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ
X

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ వెయ్యి పాయింట్లకుపైగా లాభాలతో ట్రేడవుతుండగా.. నిఫ్టీ 24 వేల మార్క్‌ను దాటింది. ముఖ్యంగా ఫైనాన్షియల్‌, ఆటో, ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణిస్తున్నాయి. ఇన్ఫోసిస్‌,మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి.

మధ్యాహ్నం 12.50 నిమిషాలకు సెన్సెక్స్‌ 1,012.66 పాయింట్ల లాభంతో 79,530 వద్ద, నిఫ్టీ 307 పాయింట్ల లాభంతో 24,050 వద్ద లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ షేర్లు రాణిస్తున్నాయి. సన్‌ ఫార్మా, అదానీ పోర్ట్స్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ. 2 లక్షల కోట్ల మేర పెరిగి రూ. 446.52 లక్షల కోట్లకు చేరింది.

కారణాలు ఇవే

డిసెంబర్‌ నెలకు సంబంధించి వెలువడిన టోకు వాహన విక్రయ గణాంకాలు మదుపర్లను మెప్పించాయి. సాధారణంగా డిసెంబర్‌ విక్రయాలు స్లోగా సాగుతుంటాయి. దీనికి విరుద్ధంగా అంచనాలను మించి అమ్మకాలు జరగడం పాజిటివ్‌ సెంటిమెంట్‌కు కారణమైంది. ముఖ్యంగా ఐషర్‌ మోటార్స్‌ 25 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయగా.. మారుతీ సుజుకీ 30 శాతం వృద్ధిని కనబరిచింది. దీంతో ఆయా కంపెనీ షేర్లు రాణిస్తున్నాయి.

డిసెంబర్‌ త్రైమాసికంతో పాటు 2025లోనూ ఐటీ కంపెనీలు మెరుగైన రెవెన్యూ వృద్ధిని కనబరిచే అవకాశం ఉందన్న సీఎల్‌ఎస్‌ఏ, సిటీ బ్రోకరేజ్‌ సంస్థలు అంచనాలు ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు కారణమైంది. ముఖ్యంగా ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా షేర్లు సూచీల పరుగుకు కారణమయ్యాయి.

First Published:  2 Jan 2025 1:35 PM IST
Next Story