Reliance | దలాల్ స్ట్రీట్‌లో రిలయన్స్ సరికొత్త రికార్డ్.. ఎం-క్యాప్ @ రూ.20 లక్షల కోట్లు!
Reliance | ముకేశ్ అంబానీ (Mukesh Ambani) సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) మరో మైలురాయి చేరుకున్నది.
Reliance | ముకేశ్ అంబానీ (Mukesh Ambani) సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) మరో మైలురాయి చేరుకున్నది. సోమవారం తన చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20 లక్షల కోట్ల మార్క్‌ను దాటేసింది. మంగళవారం బీఎస్ఈ ట్రేడింగ్‌లో రిలయన్స్ షేర్.. 1.89 శాతం పెరిగి రూ.2,957.80లతో తాజా 52వారాల గరిష్టాన్ని తాకింది.
గత నెల 29న రూ.19 లక్షల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్క్‌ను దాటిన రిలయన్స్ కేవలం రెండు వారాల్లోనే రూ.లక్ష కోట్లు పెరిగి రూ.20 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. ఈ ఏడాదిలో రిలయన్స్ షేర్ సుమారు 14 శాతం వృద్ధి సాధించింది. ఆయిల్ టు టెలికం వరకు వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న రిలయన్స్ సంస్థ.. దలాల్ స్ట్రీట్ చరిత్రలోనే అత్యంత సంపద సృష్టించిన సంస్థగా నిలిచింది.
2005 ఆగస్టులో రిలయన్స్ రూ.లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్క్‌ను అధిగమిస్తే, 2019 నవంబర్‌లో రూ.10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు చేరుకున్నది. కానీ రూ.10 లక్షల కోట్ల నుంచి రూ.20 లక్షల కోట్ల మార్క్‌కు చేరుకోవడానికి రిలయన్స్‌కు నాలుగున్నరేండ్ల సమయం పట్టింది. రిలయన్స్ రూ.20 లక్షల కోట్ల మైలురాయిని చేరుకోగా, తర్వాతీ స్థానాల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ.15 లక్షల కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.10.5 లక్షల కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.7 లక్షల కోట్లు, ఇన్ఫోసిస్ రూ.7 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉన్నాయి.
డిసెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ అంచనాలకు అనుగుణంగా మార్కెట్ ఫలితాలు ప్రకటించింది. రూ.19,641 కోట్ల నికర లాభం గడించింది. త్రైమాసికం వారీగా 1.2 శాతం, గతేడాదితో పోలిస్తే 10.3 వాతం ఎక్కువ. మార్కెట్ వర్గాలు రూ.18,080 కోట్ల నికర లాభం రిలయన్స్ ప్రకటిస్తుందని అంచనా వేశాయి. ప్యాట్ మార్జిన్ 8.6 శాతం నుంచి 8.7 శాతానికి పెరిగింది.