Telugu Global
Business

కబ్జా కోసం పొంచి వున్న రిలయన్స్- వాల్ట్ డిస్నీ!

రిలయన్స్-డిస్నీ విలీనం భారతదేశంలోని పోటీదారులైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోల మనుగడకి పెను సవాళ్ళని విసరగలదని భావిస్తున్నారు.

కబ్జా కోసం పొంచి వున్న రిలయన్స్- వాల్ట్ డిస్నీ!
X

దేశంలో ఇటీవలి రిలయన్స్- వాల్ట్ డిస్నీ విలీనం సంచలనాత్మకంగా మారింది. ఈ విలీనంతో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ సంస్థ కలిసి భారతదేశ స్ట్రీమింగ్ మార్కెట్‌లో దాదాపు 50 శాతాన్ని కబ్జా చేస్తాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రిలయన్స్-డిస్నీ విలీనం భారతదేశంలోని పోటీదారులైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోల మనుగడకి పెను సవాళ్ళని విసరగలదని భావిస్తున్నారు. బ్లూమ్ బెర్గ్ పత్రికలో ప్రచురించిన కామ్‌స్కోర్ డేటా రిపోర్టు ప్రకారం, ఈ మీడియా దిగ్గజాల విలీనానికి ముందు, దేశంలోని దాదాపు సగం మంది ఇంటర్నెట్ వినియోగదారులు రిలయన్స్, వాల్ట్ డిస్నీ యాజమాన్యాలలోని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో సినిమాలు, టీవీ షోలు, వార్తలు, క్రీడలు మొదలైన కంటెంట్ ని వీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం కంటెంట్ ని ఏక గవాక్షంలో అందించి 8.5 బిలియన్ మీడియా దిగ్గజాన్ని సృష్టించేందుకు రిలయన్స్ ముందుకొచ్చి డిస్నీ ఇండియా వ్యాపారాన్ని కొనుగోలు చేసేసింది.

కామ్‌స్కోర్ రిపోర్టు ప్రకారం, భారతీయ మార్కెట్ వాటాలో 46.6 శాతం అంటే, 243.5 మిలియన్ల వినియోగదారులు -డిస్నీకి చెందిన హాట్‌స్టార్, రిలయన్స్ కి చెందిన జియో సినిమా, జియో టీవీ అనే మూడు ప్లాట్ ఫారమ్స్ ని విజిట్ చేశారు. హాట్ స్టార్ ఒక్కటే 144 మిలియన్లకి పైగా విజిజటర్స్ ని సంపాదించుకుంటే, జియో సినిమా, జియో టీవీ రెండూ కలిసి 129 మిలియన్లకి పైగా విజిటర్స్ ని పొందాయి.

ఈ ప్లాట్‌ఫారమ్‌ల విజయానికి స్ట్రీమింగ్ క్రికెట్ మ్యాజిక్ అద్భుతంగా పని చేసిందని కామ్‌స్కోర్ డేటా చూపిస్తోంది. నవంబర్లో పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ద్వారా హాట్‌స్టార్ 191 మిలియన్ల మంది సందర్శకుల్ని ఆకర్షించింది. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కవరేజి వచ్చేసి రిలయన్స్ కి అద్భుతాలు చేసింది.

రిలయన్స్- వాల్ట్ డిస్నీ లు వయాకామ్ 18- స్టార్ ఇండియా వ్యాపారాల్ని కలిపేసి జాయింట్ వెంచర్ ని రూపొందించడానికి ఒప్పందాలపై గత నెలలో సంతకాలు చేశాయి. ముఖేష్ అంబానీ ఈ జాయింట్ వెంచర్లో రూ. 11,500 కోట్లు లేదా 1.4 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నారు. కొత్త వెంచర్‌ ని పూర్తిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నియంత్రిస్తుంది. ఇది 16.34 శాతం వాటా కలిగి వుంటుంది. అయితే 46.82 శాతం వాటా వయాకామ్, 36.84 శాతం వాటా డిస్నీ యాజమాన్యాలలో వుంటాయి. విలీన సంస్థకి నీతా అంబానీ చైర్‌పర్సన్‌గా, డిస్నీ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ చైర్‌పర్సన్‌గావుంటారు.

50 శాతం మార్కెట్ కబ్జాతో ఈ మీడియా విలీనం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, మినీటీవీ వంటి మార్కెట్ ప్లేయర్స్ కి గట్టి పోటీని సృష్టిస్తుంది. ఎంఎక్స్ ప్లేయర్, జీ5, సోనీలివ్ వంటి ఇతర స్థానిక ప్లాట్‌ఫారమ్‌లకి కూడా ఈ కబ్జా భయం తప్పదు. కబ్జా కంటెంట్ స్ట్రీమింగ్ విషయంలోనే కాదు, విలీనమైన ఈ రెండు సంస్థలూ కలిసి దేశంలోని మెజారిటీ అడ్వర్టైజింగ్ మార్కెట్‌ ని కూడా తినేయగలవు. సాంప్రదాయ మీడియా ప్రసారకర్తలపై ఇది ప్రభావం చూపుతుంది. ఈ విలీనం ఇతర లీనియర్ టీవీ ప్రసారకర్తలైన సన్ టీవీ, జెడ్ సోనీ, మరికొన్ని ఇతర వాటిపై ప్రతికూల ప్రభావాన్ని చూపగలదని భయపడుతున్నారు. కాగా ఈ మహా విలీనం ఓటీటీ చందాదారులకు భారీ రుసుములు కూడా వడ్డించ గలదు. ప్రత్యర్ధుల నుంచీ ప్రేక్షకుల వరకూ అందరూ పారా హుషార్!

First Published:  6 March 2024 7:44 AM
Next Story