Rear Seat Belt Alaram | రేర్ సీట్ బెల్ట్ అలారం తప్పనిసరి.. కార్ల తయారీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు..!
Rear Seat Belt Alaram | 2025 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి విక్రయించే అన్ని కార్లలో రేర్ సీట్ బెల్ట్ అలారం ఫీచర్ అమర్చాలని కార్ల తయారీ సంస్థలను ఆదేశించింది.
Rear Seat Belt Alaram | కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అత్యాధునిక ఫీచర్లతో విశాలంగా ఉన్న ఎస్‌యూవీ కార్లపై మోజు పెంచుకుంటున్నారు. దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శనకు జాతీయ రహదారులపై ప్రయాణిస్తుంటారు. పట్టణాలు, నగరాల పరిధిలో అధికారిక, పర్సనల్ పనులపై వెళుతున్నప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి.
ఒక్కోసారి వాటిల్లో ప్రయాణిస్తున్న వారు దుర్మరణం పాలవుతుంటారు. గుజరాత్‌లో ఇటీవల ఎస్‌యూవీ కారులో వెళుతున్న టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ, ఆయన స్నేహితుడు జహంగీర్ పండోలే.. రోడ్డు ప్రమాదంలో దుర్మణం పాలయ్యారు. కారు డ్రైవ్ చేస్తున్న మహిళా డాక్టర్ అనితా పండోలే, ఆమె భర్త దారియస్ పండోలే తీవ్రగాయాల పాలయ్యారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 2025 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి విక్రయించే అన్ని కార్లలో రేర్ సీట్ బెల్ట్ అలారం ఫీచర్ అమర్చాలని కార్ల తయారీ సంస్థలను ఆదేశించింది. అందుకోసం ప్రజాభిప్రాయ సేకరణకు కేంద్ర జాతీయ రహదారులు, రవాణాశాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రయాణికుల సేఫ్టీ కోసం అన్ని కార్లలో సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్, 3-పాయింట్ సీట్ బెల్ట్ తప్పని చేస్తూ కేంద్రం గతేడాది నవంబర్ ఏడో తేదీన ఇచ్చిన నోటిఫికేషన్ అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో కార్లు, కార్లలో ప్రయాణించే వారి సేఫ్టీ కోసం రేర్ సీట్ ప్యాసింజర్లకు సీట్ బెల్ట్ తప్పనిసరి చేస్తూ కేంద్ర జాతీయ రహదారులు, రవాణాశాఖ కీలకమైన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ప్రజాభిప్రాయం వెల్లడించిన తర్వాత తుది నోటిఫికేషన్ జారీ చేస్తుంది. గుజరాత్‌లో ఎస్‌యూవీ కారులో ప్రయాణిస్తున్న సైరస్ మిస్త్రీ, ఆయన స్నేహితుడు సీట్‌బెల్ట్ వాడనందు వల్లే దుర్మరణం పాలయ్యారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే త్రీ పాయింట్ రేర్ సీట్ బెల్ట్, సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి చేసింది కేంద్రం.
ప్రస్తుతం డ్రైవర్, ఫ్రంట్ సీట్‌లో కూర్చునే ప్రయాణికుడికి ఇన్‌బిల్ట్ సీట్ బెల్ట్ రిమైండర్ తప్పనిసరి చేసింది. రేర్ సీట్ ప్యాసింజర్లు సీట్ బెల్ట్ వాడకుంటే కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు (సీఎంవీఆర్) 138 (3) నిబంధన ప్రకారం రూ.1000 జరిమాన విధించాలని మోటారు వాహన చట్టం నిర్దేశించినా.. అత్యధికులు ఆ నిబంధన అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం గానీ, అవగాహన లేమితో వ్యవహరిస్తున్నారు. రేర్ ప్యాసింజర్లు సీట్ బెల్ట్ ధరించకుంటే ట్రాఫిక్ పోలీసులు అరుదుగా జరిమాన విధిస్తున్నారు.