RBI Repo Rate | యథాతథంగా వడ్డీరేట్లు.. ఆహార ధరల ఒత్తిళ్లను పర్యవేక్షిస్తాం.. తేల్చేసిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
RBI Repo Rate | ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షా కమిటీ వరుసగా ఆరోసారి రెపోరేట్ 6.5 శాతంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నది.
RBI Repo Rate | ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షా కమిటీ వరుసగా ఆరోసారి రెపోరేట్ 6.5 శాతంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నది. అంతర్జాతీయ అనిశ్చితి నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితులపై అలర్ట్‌గా ఉంటామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలో కొనసాగడానికి ఆహార వస్తువుల ధరల్లో ఒడిదొడుకులే కారణం అని పేర్కొన్నారు. ఆహార వస్తువుల ధరలు పెరుగుతున్నా, క్రూడాయిల్ ధరపై అనిశ్చితి కొనసాగుతున్నా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.4 శాతం వద్దే కొనసాగుతుందని ఆర్బీఐ అంచనా వేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బారత్ ఏడు శాతం వృద్ధిరేటు సాధిస్తుందని పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికంలో 7.2 శాతం, రెండో త్రైమాసికంలో 6.8, మూడో త్రైమాసికంలో 7, నాలుగో త్రైమాసికంలో 6.9 శాతం వృద్ధిరేటు నమోదవుతుందని తెలిపింది. 2022 ఏప్రిల్ ద్రవ్యోల్బణం ఆందోళన కర స్థాయిలో పెరిగిపోవడంతో 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి వరకు దఫదఫాలుగా 250 బేసిక్ పాయింట్లు పెంచడంతో రెపోరేటు 6.5 శాతానికి చేరుకున్నది.
తమ ద్రవ్య పరపతి సమీక్షా కమిటీ అనునిత్యం ఆహార వస్తువుల ధరలను పర్యవేక్షిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో ముడి చమురు ధరలపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయి స్వల్ప ఒడిదొడుకులకు గురైనా, అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ స్థిరంగా కొనసాగుతున్నదని తెలిపారు. ఇక అన్ని రకాల రిటైల్, ఎంఎస్ఎంఈ రుణాలు మంజూరు చేయడానికి సంబంధిత రుణ గ్రహీతల నుంచి కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు బ్యాంకులకు ఆర్బీఐ కొంత గడువు ఇవ్వనున్నది.
తటస్త ద్రవ్య పాలసీ వల్ల మార్కెట్లో మరింత సౌకర్యవంతంగా ద్రవ్య లభ్యతకు ఆర్బీఐకి వెసులుబాటుగా ఉంటుంది. ఆర్థిక వృద్ధిరేటు కోసం మార్కెట్లోకి నగదు పంపిణీ పెంచేందుకు ఆర్బీఐ చర్యలు చేపడుతుంది. అవసరమైనప్పుడు నగదు పంపిణీని తగ్గించడానికి కృషి చేస్తుంది. 2020-21లో కొవిడ్-19 ఉధృతంగా సాగినప్పుడు ఖర్చులను ప్రోత్సహించడానికి, రుణ పరపతి సౌకర్యం పెంపొందించడానికి బ్యాంకింగ్ వ్యవస్థలోకి నగదు భారీగా ఆర్బీఐ పంపించింది.
రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా పెరగడంతో 2022 ఏప్రిల్ తర్వాత నిధుల పంపిణీని నిలిపేసింది. ఆరు నెలలకు పైగా బ్యాంకింగ్ వ్యవస్థలో నిధుల కొరత ఏర్పడింది. జనవరిలో ఆర్బీఐ నుంచి బ్యాంకులు భారీ స్థాయిలో రూ.3 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నాయి. ఏడాది కాలంగా ఆర్బీఐ సారధ్యంలోని ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) అధికారికంగా వడ్డీరేట్లు పెంచుకున్నా, వ్యవస్థలోకి ద్రవ్య లభ్యతను తగ్గించడంపై దృష్టి సారించింది. ఒకవైపు రెపోరేటు యధాతథంగా కొనసాగిస్తూ వచ్చినా 2023 జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.44 శాతం నుంచి దిగి వచ్చింది. గత డిసెంబర్ నాటికి అది 5.69 శాతానికి పడిపోయింది. ఆర్బీఐ కంఫర్టబుల్ ద్రవ్యోల్బణం 4-6 శాతం మధ్య ఉంటుంది.