పారిశ్రామిక దిగ్గజం.. భవిష్యత్ తరాలకు దిక్సచీ రతన్ టాటాకు యావత్ దేశం కన్నీటితో తుది వీడుకోలు పలికింది. ముంబయిలోని వర్లీ శ్మశాన వాటికలో గురువారం సాయంత్రం ఆయన పార్థీవ దేహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు అంత్యక్రియలు నిర్వహించారు. అనారోగ్యంతో మృతిచెందిన రతన్ టాటా పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఎన్‌సీపీఏ గ్రౌండ్ లో ఉంచారు. గురువారం మధ్యాహ్నం తర్వాత ఆయన అంతిమయాత్ర ప్రారంభించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలు అంతిమయాత్రలో పాల్గొన్నారు. వర్లీ శ్మశాన వాటికలోని ఎలక్ట్రిక్ దహన వాటికలో ఆయన పార్థీవ దేహాన్ని దహనం చేశారు. రతన్ టాటా పార్సీ కావడంతో ప్రకృతి కలుషితం కాకుండా అంత్యక్రియలు పూర్తి చేశారు. పార్సీలు శరీరం ప్రకృతి ప్రసాదమని.. ఎలా వచ్చిన శరీరాన్ని అలాగే ప్రకృతికి అంకితం చేయాలని భావిస్తారు. ఈక్రమంలో ఎవరైనా పార్సీ మరణిస్తే అంత్యక్రియలు చేయడానికి ముందు ప్రత్యేక ప్రార్థనలు చేసి టవర్ ఆఫ్ సైలెన్స్ అని పేర్కొనే అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశానికి తరలిస్తారు. అక్కడ రాబందులు తినేందుకు వీలుగా పార్థీవ దేహాన్ని ఉంచుతారు. రాబందులు లేకపోవడం, మారిన పరిస్థితులకు అనుగుణంగా పార్సీల అంత్యక్రియల పద్ధతుల్లోనూ మార్పులు వచ్చాయి. పార్థీవ దేహాల అంత్యక్రియలతో నీరు, అగ్ని, నేల కాలుష్యం కాకుండా ఎలక్ట్రికల్, సోలార్ దహన వాటికల్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇదే పద్ధతిలో రతన్ టాటాకు అంతిమ సంస్కారం పూర్తి చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించింది. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఆయనకు నివాళులర్పించారు.
Previous Articleనేషనల్ కాన్ఫరెన్స్ ఎల్పీ నేతగా ఒమర్ అబ్దుల్లా
Next Article జమిలి ఎన్నికలపై కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Keep Reading
Add A Comment