అదానీపై లంచం అభియోగాల్లేవ్
అదానీ గ్రూప్‌నకు చెందిన గ్రీన్ ఎనర్జీ సంస్థ కీలక ప్రకటన
అదానీ, దాని అనుబంధ సంస్థలు.. సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందడానికి భారత ప్రభుత్వ అధికారులకు పెద్ద ఎత్తున లంచాలు ఆఫర్ చేశారన్న ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదవడం ఇటీవల సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై తాజాగా అదానీ గ్రూప్‌నకు చెందిన గ్రీన్ ఎనర్జీ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ కేసుకు సంబంధించి గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్‌పై లంచం అభియోగాలు నమోదైనట్లు వార్తలు అవాస్తవమని వెల్లడించింది.
ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంచ్ ఫైలింగ్ సందర్భంగా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ దీనిపై స్పందించింది. అమెరికా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) కింద గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్, కంపెనీ సీనియర్ డైరెక్టర్ వినీత్ జైన్‌పై లంచం, అవినీతి అభియోగాలు నమోదైనట్లు వచ్చిన కథనాలను మేం తిరస్కరిస్తున్నాం. అవన్నీ అవాస్తవం. వీరంతా సెక్యూరిటీస్ సంబంధించిన మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్నారే తప్ప వారి లంచం, అవినీతి అభియోగాలు ఏవీ నమోదు కాలేదు. ఎఫ్‌సీపీఏ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారే తప్ప వారిపై లంచం, అవినీతి అభియోగాలు ఏవీ నమోదు కాలేదు. ఎఫ్‌సీపీఏ నిబంధనలు ఉల్లంఘించారని అమెరికా న్యాయశాఖ నమోదు చేసిన కేసులో ఈ ముగ్గురు పేర్ల ప్రస్తావన లేదని అదానీ గ్రీన్ పేర్కొన్నది.
భారత్‌లో పోర్టులు, విమానాశ్రయాలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో అగ్రగామి పారిశ్రామిక వేత్తగా కొనసాగుతున్న అదానీ అమెరికాలో నిధుల సేకరణ కోసం భారత అధికారులకు 250 మిలియన్ డాలర్లకు పైగా లంచం ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు బిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్‌లో కేసు నమోదైంది. గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ సహా మరో ఏడుగురు ఇందులో నిందితులుగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీరు ఓ కాంట్రాక్టు విషయంలో 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌర విద్యుత్ సరఫరా ఒప్పందాలను పొందడానికి భారత ప్రభుత్వ అధికారులకు దాదాపు 265 మిలియన్ డాలర్లు లంచాలు చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా రుణాలు, బాండ్లను సేకరించినట్లు అధికారులు అభియోగాలు మోపారు.