Maruti Suzuki Exports | కార్ల ఎగుమతిపై మారుతి సుజుకి బ్లూ ప్రింట్.. 2030 నాటికి టార్గెట్ ఇదే..!
Maruti Suzuki Exports | దేశీయ మార్కెట్‌లో అత్యధిక వాటా కలిగిన కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. విదేశాల్లో మార్కెట్ పెంచుకోవడంపై దృష్టిని కేంద్రీకరించింది. ఏయేటికాయేడు ఎగుమతులు పెంచుకుంటూ ముందుకు సాగుతున్నది.
Maruti Suzuki Exports | దేశీయ మార్కెట్‌లో అత్యధిక వాటా కలిగిన కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. విదేశాల్లో మార్కెట్ పెంచుకోవడంపై దృష్టిని కేంద్రీకరించింది. ఏయేటికాయేడు ఎగుమతులు పెంచుకుంటూ ముందుకు సాగుతున్నది. సానుకూల పరిస్థితులు ఇలాగే సాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో విదేశాలకు మూడు లక్షలకు పైగా కార్లను ఎగుమతి చేయగలమని విశ్వాసంతో ఉంది. 2029-30 నాటికి ఎనిమిది లక్షల కార్లు ఎగుమతి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నది. 100కి పైగా దేశాల్లో మరిన్ని మోడల్ కార్లు ఆవిష్కరించాలని సంకల్పించింది. భారత్‌లో బ్యాంకింగ్ ఫైనాన్స్ సౌకర్యం, సర్వీస్ సెంటర్ల బలోపేతం వంటి పద్దతులను అవలంభించడం ద్వారా వివిధ దేశాల్లో పంపిణీ నెట్‌వర్క్ పెంపొందించుకోవాలని తలపోస్తోంది.
మూడేండ్ల క్రితం వరకూ ప్రతియేటా లక్ష నుంచి 1.2 లక్షల కార్లు మాత్రమే ఎగుమతి చేశాం. జాతీయ విజన్, వ్యాపార ఆకాంక్షలకనుగుణంగా ఎగుమతులు పెంచుకోవాలని నిర్ణయించాం. తదనుగుణంగానే 2022-23లో 2.59 లక్షల కార్లు, 2023-24లో 2.83 లక్షల కార్లు ఎగుమతి చేశాం. వాస్తవంగా భారత్ నుంచి విదేశాలకు కార్ల ఎగుమతులు మూడు శాతం తగ్గాయి. కానీ, మారుతి సుజుకి సుమారు 9.3 శాతం వృద్ధి సాధించింది. 2022-23తో పోలిస్తే 2023-24లో 2.83 లక్షల కార్లు విదేశాలకు ఎగుమతి చేశాం. విదేశాలకు కార్ల ఎగుమతిలో మా సంస్థ మార్కెట్ వాటా 42 శాతం అని మారుతి సుజుకి కార్పొరేట్ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భారతి పీటీఐకి చెప్పారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి 2,83,067 కార్లు ఎగుమతి చేసింది. 2022-23లో 2,59,33 కార్లు, 2021-22లో 2,38,376 యూనిట్లు ఎగుమతి చేసింది. 2020-21లో 96,139 కార్లు ఎగుమతి చేస్తే, అంతకుముందు 2019-20లో 1,08, 749 కార్లు విదేశాల్లో విక్రయించింది. దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, చిలీ మెక్సికో, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఐవరీ కోస్ట్ వంటి పది దేశాలకు మారుతి సుజుకి గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఎగుమతి చేసింది. హ్యాచ్ బ్యాక్ బాలెనోతోపాటు డిజైర్, స్విఫ్ట్, ఎస్ ప్రెస్సో, గ్రాండ్ విటారా, జిమ్నీ, సెలెరియో, ఎర్టిగా వంటి టాప్ మోడల్ కార్లు విదేశాలకు ఎగుమతి చేస్తున్నది.
ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వ విజన్‌తో మమేకమై.. కేంద్రం వికసిత్ భారత్ ఆకాంక్షలకు అనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్లో ప్రధాన వాటా సంపాదించడమే లక్ష్యంగా మారుతి సుజుకి ముందుకు సాగుతుందన్నారు రాహుల్ భారతి. ప్రస్తుత మోడల్ కార్లతోపాటు 2024-25లో ఎగుమతి చేయడానికి ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తామన్నారు. జపాన్, యూరోపియన్ యూనియన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతులు ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం అన్ని దేశాలకూ అన్ని రకాల మోడల్ కార్లు ఎగుమతి చేయడం లేదన్నారు. కానీ, మరిన్ని మోడల్ కార్లు పలు దేశాల్లో మార్కెట్ చేసుకోవడానికి, పంపిణీ వ్యవస్థ పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.