ఎల్‌ఐసీ ఫర్ సేల్.. అప్పులదే పెద్ద పద్దు!
కేంద్ర బడ్జెట్‌లో 24 శాతం ఆదాయం అప్పులతోనే
కోట్లాది మంది భారతీయుల విశ్వాసాన్ని చూరగొన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ)ను కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. కేంద్ర బడ్జెట్ రూపంలో ఎల్‌ఐసీ ఫర్ సేల్ అనేసింది. కేంద్ర బడ్జెట్‌లో అప్పులదే పెద్ద పద్దుగా ఉంది. కేంద్రానికి సమకూరే ఆదాయంలో 24 శాతం అప్పులు, ఇతర రూపాల్లో సమకూర్చుకుంటామని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం సమకూరే ఆదాయం, చేయాల్సిన ఖర్చుల వివరాలను ''రూపాయి రాక.. పోక'' రూపంలో వెల్లడించారు. 24 శాతం ఆదాయం అప్పులు, ఇతర ఆదాయ మార్గాల్లోనే అంటే అప్పులతో పాటు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టబడుల ఉపసంహరణ ద్వారా భారీ ఆదాయం సమపార్జించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఈక్రమంలో ఇన్సూరెన్స్ రంగంలో 74 శాతంగా ఉన్న ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను 100 శాతానికి పెంచింది. ప్రభుత్వరంగంలోని ఇన్సూరెన్స్ రంగాన్ని, ముఖ్యంగా ఎల్‌ఐసీని పూర్తిగా ప్రవేటుపరం చేయడానికి కేంద్రం రంగం సిద్ధం చేసింది. పెట్టుబడుల ఉపసంహరణతో పాటు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన ఆస్తులను అమ్మడం ద్వారా ఆదాయం సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కేంద్ర బడ్జెట్‌కు ఆదాయ పన్ను రూపంలో 22 శాతం ఆదాయం సమకూరుతుంది. అప్పులు, పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల అమ్మకాల ద్వారా సమకూరే 24 శాతం ఆదాయం తర్వాతి స్థానంలో ఇన్‌కం ట్యాక్స్ ఆదాయం ఉంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ), ఇతర పన్నుల రూపంలో 18 శాతం, కార్పొరేట్ ట్యాక్స్ రూపంలో 17 శాతం, నాన్ ట్యాక్స్ రిసీట్స్ రూపంలో 9 శాతం, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ రూపంలో 5 శాతం, కస్టమ్స్ రూపంలో నాలుగు శాతం, నాడ్ డెబ్ట్ క్యాపిటల్ రిసీట్స్ రూపంలో ఒక శాతం ఆదాయం సమకూరుతుందని వెల్లడించారు. కేంద్రానికి సమకూరే ఆదాయమే కాదు చేసే ఖర్చులోనూ అప్పులదే పెద్ద పద్దుగా కనిపిస్తుంది. ''రూపాయి పోక (చేసే వ్యయంలో)'' 20 శాతం అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. 22 శాతం ఆదాయం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాగా చెల్లించాల్సి ఉంటుందని బడ్జెట్‌లో వెల్లడించారు. కేంద్ర పథకాలు (రక్షణ రంగంలో చేసే మూలధన వ్యయం, సబ్సిడీలు కాకుండా) 16 శాతం, రక్షణ రంగానికి 8 శాతం, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీములకు 8 శాతం, ఆర్థిక సంఘం నిధులు, ఇతర చెల్లింపులకు 8 శాతం, ఇతర వ్యయం రూపంలో 8 శాతం, మెజర్ సబ్సిడీల రూపంలో 6 శాతం, పెన్షన్లకు 4 శాతం నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
2024 -25 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడుల రూపంలో 31.3 శాతం ఆదాయం వస్తుందని అంచనా వేయగా 0.4 శాతం తగ్గి 30.9 శాతం సమకూరిందని వెల్లడించారు. 2025 -26 ఆర్థిక సంవత్సరంలో 34.2 శాతంగా రెవెన్యూ రాబడి ఉంటుందని అంచనా వేశామన్నారు. క్యాపిటల్ రిసీట్స్ రూపంలో 16.9 శాతం ఆదాయం వస్తుందని అంచనా వేయగా 0.6 శాతం తగ్గి 16.3 శాతమే సమకూరిందని, 2025 -26 ఆర్థిక సంవత్సరంలో దీనిని 2025 -26లో 16.4 శాతంగా అంచనా వేశామని పేర్కొన్నారు. 2024 -25 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వ్యయం 15 శాతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా 1.8 శాతం తక్కువగా 13.2 శాతమే ఖర్చు చేశారు. 2025 -26 ఆర్థిక సంవత్సరంలో దీనిని 15.5 శాతంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024 -25లో రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ 37.1 శాతంగా చేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించి 0.1 శాతం తక్కువగా అంటే 37 శాతం ఖర్చు చేశారు. 2025 -26 ఆర్థిక సంవత్సరంలో దీనిని 39.4 శాతంగా ప్రతిపాదించారు. జీడీపీలో ద్రవ్యలోటు 2021 -22 ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం ఉండగా 2025-26లో 4.4 శాతానికి తగ్గుతుందని అంచనా వేశారు. రెవెన్యూ డెఫిసిట్ 4.4 శాతం నుంచి 1.5 శాతానికి , ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ 3.3 శాతం నుంచి 0.3 శాతానికి, ప్రైమరీ డెఫిసిట్ 3.3 శాతం నుంచి 0.8 శాతానికి తగ్గుతుందని అంచనా వేశారు.
రక్షణ రంగానికే అధిక నిధులు
కేంద్ర బడ్జెట్‌లో మరోసారి రక్షణ రంగానికే అధిక నిధులు కేటాయించారు. రక్షణ శాఖకు బడ్జెట్‌లో రూ.4,91,732 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించారు. గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.2,66,817 కోట్లు మాత్రమే కేటాయించారు. పట్టణీకరణ వేగంగా పెరుగుతోన్న నేపథ్యంలో ఉపాధి హామీ పథకానికి చేసే ఖర్చును కేంద్ర ప్రభుత్వం కుదిస్తూ పోవడంతోనే గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయింపులు తగ్గుతున్నట్టుగా స్పష్టమవుతోంది. హోం మంత్రిత్వ శాఖ (అంతర్గత భద్రత)కు రూ.2,33,211 కోట్లు, వ్యవసాయం అనుబంధ రంగాలకు రూ.1,71,437 కోట్లు, విద్యారంగానికి రూ.1,28,650 కోట్లు, హెల్త్ సెక్టార్ కు రూ.93,311 కోట్లు, అర్బన్ డెవలప్‌మెంట్ కు రూ.96,777 కోట్లు, ఐటీ - టెలికాం శాఖలకు రూ.95,298 కోట్లు, ఎనర్జీ (విద్యుత్ శాఖ) రంగానికి రూ.81,174 కోట్లు, కామర్స్ అండ్ ఇండస్ట్రీ రంగానికి రూ.65,553 కోట్లు, సోషల్ వెల్ఫేర్‌కు రూ.60,052 కోట్లు, సైంటిఫిక్ డిపార్ట్‌మెంట్లకు రూ.55,679 కోట్ల కేటాయింపులు చేశారు.