ఒక్క రోజులో రూ.10 లక్షల కోట్లు ఉఫ్!
భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీగా పతనమవడంతో సోమవారం ఒక్కరోజే రూ.10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి అయ్యింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో మధుపరుల సంపద రూ.410 లక్షల కోట్లకు పడిపోయింది. సోమవారం ఉదయం నుంచే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఉదయం 75,700.43 పాయింట్ల వద్ద భారీ నష్టాల్లో మొదలైన ట్రేడింగ్ రోజంతా అదే బాటలో కొనసాగింది. చివరికి 824.29 పాయింట్ల నష్టంతో 75,366 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 263 పాయింట్లు నష్టపోయి 22,829 పాయింట్ల వద్ద ముగిసింది. మరోసారి రూపాయి విలువ పతనమయ్యింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 11 పైసలు తగ్గి రూ.86.33 వద్ద ముగిసింది. టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ హెచ్‌సీఎల్, జొమాటో, టెక్ మహీంద్ర షేర్లు నష్టపోగా, ఎస్‌బీఐ, మహీంద్ర అండ్ మహీంద్ర, హిందూస్థాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి సుజుకి షేర్లు లాభాలు దక్కించకున్నాయి.