లాభాల్లో ముగిసిన సూచీలు
నిన్నటి భారీ నష్టాల నుంచి మదుపర్లకు కొద్దిగా ఊరట
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల నేపథ్యంలో మన సూచీలు మోస్తరుగా రాణించాయి. నిన్నటి భారీ నష్టాల నుంచి మదుపర్లకు కొద్దిగా ఊరట దక్కింది. ముఖ్యంగా హెచ్‌ఎంవీపీ వైరస్ కు సంబంధించి పెద్దగా ఆందోళన అక్కర్లేదన్న వార్తలుకూడా కొంత సానుకూలతకు కారణమయ్యాయి.
సెన్సెక్స్ సూచీ ఉదయం 78,010.80 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా మోస్తరు లాభాల్లో కొనసాగింది ఇంట్రాడేలో 78,452.74 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ చివరికి 234.12 పాయింట్ల లాభంతో 78,199.11 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 91.85 పాయింట్ల లాభంతో 23,707 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 5 పైసలు క్షీణించి 85.73 గా ఉన్నది. అంతర్జాతీయ విపణలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 76 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2653 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.
సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. జొమాటో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి.