Telugu Global
Business

వరుసగా ఆరో రోజూ నష్టాల్లోనే సూచీలు

ఎఫ్‌ఐఐల అమ్మకాలు, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వంటివి సూచీల పతనానికి కారణం

వరుసగా ఆరో రోజూ నష్టాల్లోనే సూచీలు
X

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. వరుసగా ఆరో రోజు నష్టపోయాయి. ఉదయం ఐటీ స్టాక్స్‌ అండతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. తీవ్ర ఒడిదొడుకుల మధ్య ప్రారంభ లాభాలు కోల్పోయాయి. సెన్సెక్స్‌ ఉదయం 81,926.99 పాయింట్ల వద్ద (కిందటి ముగింపు 81,688.45) లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 82,137.77 వద్ద గరిష్ఠాన్ని తాకింది. తర్వాత నష్టాల్లోకి వెళ్లిన సూచీ ఇంట్రాడేలో 80,726.06 వద్ద కనిష్ఠాన్ని తాకింది.

ముఖ్యంగా ఎఫ్‌ఐఐల అమ్మకాలు, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో పతనమయ్యాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇంట్రాడే సెన్సెక్స్‌ 900 పాయింట్ల మేర పతనమై 81,050 వద్ద ముగియగా.. నిఫ్టీ కూడా 218.85 పాయింట్ల నష్టంతో 24,795.75 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 30 సూచీలో అదానీ పోర్ట్స్‌, ఎన్టీపీసీ, ఎస్‌బీఐ, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభపడ్డాయి.డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.99గా ఉన్నది. అంతర్జాతీయంగా బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర రూ. 79.46 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2674 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.

First Published:  7 Oct 2024 7:43 PM IST
Next Story