UPI Payments-World | విదేశీ పర్యటనకు వెళుతున్నారా.. అక్కడా యూపీఐ పేమెంట్స్ చేసేయొచ్చు.. ఎలాగంటే..?!
UPI Payments-World | విదేశాల్లోని టూరిస్ట్ స్పాట్లను సందర్శించడానికి వెళుతున్నారా..! అయితే, గతంలో మాదిరిగా ఫారెక్స్ మార్కెట్‌లో మన కరెన్సీని డాలర్లలోకి మార్చుకుని వెళ్లనక్కరలేదు.
UPI Payments-World | విదేశాల్లోని టూరిస్ట్ స్పాట్లను సందర్శించడానికి వెళుతున్నారా..! అయితే, గతంలో మాదిరిగా ఫారెక్స్ మార్కెట్‌లో మన కరెన్సీని డాలర్లలోకి మార్చుకుని వెళ్లనక్కరలేదు. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, భారత్‌పే తదితర యాప్స్ ద్వారా రోజువారీ మనీ చెల్లింపులు జరిపినట్లే విదేశాల్లోనూ చేసేయొచ్చు. క్షణాల్లో చెల్లింపులు జరిగిపోతాయి. కాకపోతే విదేశాల్లోని పర్యాటక ప్రదేశాలకు వెళ్లే వారు తమ స్మార్ట్ ఫోన్లలో గూగుల్‌పే (Google Pay) ఇన్‌స్టాల్ చేసుకుంటే సరి. విదేశాల్లో మొబైల్ ఫోన్ యాప్ ఆధారిత యూపీఐ చెల్లింపులు సజావుగా సాగేందుకు గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అనుబంధ.. ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిలెడ్ (ఎన్ఐపీఎల్) అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేశాయి. ఈ అవగాహనా ఒప్పందంతో ప్రపంచ దేశాల్లో యూపీఐ సేవలు బలోపేతం కానున్నాయి. ఇప్పటి వరకు ఫారిన్ కరెన్సీ, క్రెడిట్, ఫారిన్ కరెన్సీ కార్డులతో డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న భారతీయ కస్టమర్లకు విదేశీ మర్చంట్ల యాక్సెస్ లభిస్తుంది.
విదేశీ పర్యటనలకు వెళ్లే భారతీయులు తేలిగ్గా ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు, భారత్ ఆవల ప్రయాణికులకు యూపీఐ సేవలను విస్తరించాలన్నదే తమ ఎంఓయూ ప్రధాన ఉద్దేశం అని గూగుల్ పే పేర్కొంది. నిరంతరాయంగా ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు మోడల్‌గా యూపీఐ తరహాలో విదేశాలు సైతం ఈ తరహా డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవడంలో సహాయకారిగా నిలుస్తుందీ యూపీఐ. యూపీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఉపయోగించుకుని వివిధ దేశాల మధ్య చెల్లింపుల ప్రక్రియ సరళతరం చేయడం, సీమాంతర ఆర్థిక లావాదేవీలు సరళీకరించడం లక్ష్యం. డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ఆపరేషన్ పరిజ్ఞానం తెలుసుకోవచ్చు.
గూగుల్‌పేతో ఎంఓయూపై ఎన్ఐపీఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రితేశ్ శుక్లా స్పందిస్తూ.. భారత్ పర్యాటకులకు విదేశాల్లో ఆర్థిక లావాదేవీలు సరళతరం చేయడం ఒక్కటే ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ప్లాన్ కాదు. ఇతర దేశాల్లోనూ విజయవంతంగా డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలను విజయవంతంగా అమలు చేయడానికి మాకు సహాయకారిగా నిలుస్తుంది. దీని నిర్వహణకు అవసరమైన పరిజ్ఞానం, అనుభవం లభిస్తుంది అని అన్నారు.
గూగుల్ పే ఇండియా పార్టనర్‌షిప్ డైరెక్టర్ దీక్షా కౌశల్ మాట్లాడుతూ సౌకర్యవంతంగా, సురక్షితంగా, తేలిగ్గా చెల్లింపులు జరిపేందుకు మరో ముందడుగు గూగుల్‌పే-ఎన్ఐపీఎల్ ఎంఓయూ అని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మార్కెట్‌లోకి యూపీఐ సేవల విస్తరణకు ఎన్ఐపీఎల్‌కు మద్దతు ఇస్తున్నందుకు తాము సంతోషంగా ఉన్నామన్నారు. ఇదిలా ఉంటే గత నెలలో యూపీఐ లావాదేవీల్లో కొత్త రికార్డు నమోదైంది. 2023 డిసెంబర్‌లో 1202 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఈ లావాదేవీల విలువ రూ.18,22,949.45 కోట్లు. 2023 నవంబర్‌లో 1,123 కోట్ల లావాదేవీల్లో రూ.17,39,740.61 కోట్ల చెల్లింపులు జరిగాయి.