క్రెడిట్ కార్డు బిల్ ఆన్ టైంలో చెల్లించకపోయారో.. ఇక అంతే!
వడ్డీ రేట్లు పెంచుకునేందుకు బ్యాంకర్లకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
మిడిల్ క్లాస్ ను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించే దివ్య ఔషధం క్రెడిట్ కార్డు. చిరుద్యోగులే కాదు.. ప్రతి నెలా కాస్త మంచి సంపాదన ఉన్నవారు సైతం ఒకటో, రెండో క్రెడిట్ కార్డులు వినియోగించడం ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయింది. ఇలా క్రెడిట్ కార్డులను ఎడాపెడా వాడేసి ఆ బిల్లులను సకాలంలో చెల్లించకపోతే సంబంధిత బ్యాంకులు వడ్డీపై చక్రవడ్డీ వేసి వినియోగదారుల జేబులు గుల్ల చేస్తున్నాయి. అలాంటి వారికి నేషనల్ కన్జూమర్స్ డిస్ప్యూట్స్ రెడ్రెస్సల్ కమిషన్ (ఎన్‌ఎసీడీఆర్‌సీ) నుంచి కాస్త రక్షణ ఉండేది. ఇప్పుడు ఉన్న ఆ కాస్త ఆధారాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. నిర్ణీత గడువులోగా క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లించని వారి నుంచి పెద్ద మొత్తంలో వడ్డీ వసూలు చేసుకోవచ్చని తేల్చిచెప్పింది. దీంతో క్రెడిట్ కార్డులు వినియోగించే వాళ్లు రీపేమెంట్ల విషయంలో ఇక నుంచి ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే..!
క్రెడిట్ కార్డుల బిల్లులు లేట్‌గా పే చేసేవారిపై బ్యాంకర్లు మోయలేని భారం మోపుతున్నారని.. 36 శాతం నుంచి 49 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నారని ఆవాజ్ ఫౌండేషన్ ఎన్‌ఎసీడీఆర్‌సీలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన కమిషన్ క్రెడిట్ కార్డుల బిల్లుల లేట్ పేమెంట్ పై సాలినా 30 శాతానికి మించి వడ్డీ వసూలు చేయొద్దని 2008లో తీర్పు చెప్పింది. ఈ తీర్పును కొందరు బ్యాంకర్లు సుప్రీం కోర్టులో అప్పీల్ చేశారు. 2009లో ఎన్‌సీడీఆర్‌సీ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. లేట్ పేమెంట్ చేస్తున్న వారిపై వడ్డీ శాతం 30 లోపే ఉండాలన్న పరిమితి వర్తించదని ఇటీవల తుది తీర్పునిచ్చింది. దీంతో వినియోగదారులు నిర్దేశిత వ్యవధిలోగా వడ్డీ లేకుండా తమ యుటిలైజేషన్ కు అనుగుణంగా బిల్లులు చెల్లించాలి.. లేదంటే బ్యాంకర్లు విధించే అదనపు వడ్డీతో సహా క్రెడిట్ కార్డుల బిల్లు మొత్తం చెల్లించాలి. ఇది తప్ప వినియోగదారులకు మరో అవకాశం లేకుండా పోయింది. క్రెడిట్ కార్డులు వినియోగించే వారు.. దానిని ఉపయోగించి ఏమైనా కొనుగోలు చేసే ముందు అది అవసరమా లేదా అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటేనే మంచిది.