Telugu Global
Business

Home Sales | ఎన్నికల ఎఫెక్ట్.. జూన్ త్రైమాసికంలో ఇండ్ల విక్రయాలు అంతంటే.. హైదరాబాద్‌లో భారీగా తగ్గిన సేల్స్..

Home Sales | తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర పరిధిలో 14 శాతం తగ్గిన ఇళ్ల విక్రయాలు 14,298 యూనిట్ల నుంచి 12,296 యూనిట్లకు పరిమితం అయ్యాయి.

Home Sales | ఎన్నికల ఎఫెక్ట్.. జూన్ త్రైమాసికంలో ఇండ్ల విక్రయాలు అంతంటే.. హైదరాబాద్‌లో భారీగా తగ్గిన సేల్స్..
X

Home Sales | ప్రతి ఒక్కరూ సొంతింటి కల సాకారం కావాలని కోరుకుంటారు. కరోనా తర్వాత స్పేసియస్‌గా ఉండే ఇండ్ల కోసం ప్రాధాన్యం ఇస్తున్నారు. గత రెండు నెలలుగా దేశమంతటా సార్వత్రిక ఎన్నికల వేడి నెలకొనడంతో దేశీయంగా ఇండ్ల విక్రయాలు తగ్గినట్లు కనిపిస్తున్నది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో గత ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇండ్ల కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంతో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇండ్ల కొనుగోళ్లు ఆరు శాతం తగ్గాయని రియాల్టీ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్ టైగర్ అంచనా వేసింది.

2023-24 మార్చి త్రైమాసికంలో 1,20,642 ఇళ్లు అమ్ముడైతే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో 1,13,768 యూనిట్లకే పరిమితం అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 80,245 ఇండ్ల విక్రయాలతో పోలిస్తే ఏప్రిల్-జూన్ మధ్య 42 శాతం వృద్ధి రికార్డయింది.

‘సార్వత్రిక ఎన్నికల సంరంభం కొనసాగుతున్నా ప్రజల సొంతింటి కల సాకారం కావాలన్న ఆకాంక్షలు యధావిధిగా కొనసాగాయి. అయితే, ఎన్నికల హోరు నేపథ్యంలో ఇండ్ల విక్రయాలు మోస్తరుగా సాగాయి. సమర్థవంతమైన మూలాలు ఉండటంతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పాజిటివ్ గానే ఉంటాయి’ అని ప్రాప్ టైగర్ డాట్ కామ్ బిజినెస్ హెడ్, ఆర్ఈఏ ఇండియా గ్రూప్ సీఎఫ్ఓ వికాస్ వాధ్వాన్ చెప్పారు. దేశంలోని ప్రధాన నగరాల్లో గతంతో పోలిస్తే కొత్త ప్రాజెక్టులు తగ్గాయన్నారు.

అయితే జనవరి- మార్చి త్రైమాసికంతో పోలిస్తే అహ్మదాబాద్ నగర పరిధిలో ఇళ్ల విక్రయాలు 26 శాతం తగ్గి 9500 యూనిట్లకు పరిమితం అయ్యాయి. బెంగళూరులో 30 శాతం పుంజుకుని 10,381 యూనిట్ల నుంచి 13,495 యూనిట్లకు పెరిగాయి. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో 10 శాతం విక్రయాలు తగ్గాయి. చెన్నైలో 4,427 యూనిట్ల నుంచి 3,984 యూనిట్లకు పడిపోయాయి.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర పరిధిలో 14 శాతం తగ్గిన ఇళ్ల విక్రయాలు 14,298 యూనిట్ల నుంచి 12,296 యూనిట్లకు పరిమితం అయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో 10 శాతం విక్రయాలు పుంజుకుని 10,058 ఇండ్ల నుంచి 11,065 యూనిట్లకు పెరిగాయి.

పశ్చిమబెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్ కతాలో 3,857 యూనిట్ల నుంచి 3,237 యూనిట్లకు తగ్గిపోయాయి. ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) పరిధిలో ఎనిమిది శాతం ఇళ్ల విక్రయాలు తగ్గాయి. గత మార్చి త్రైమాసికంలో 41,594 ఇళ్లు అమ్ముడైతే, జూన్ త్రైమాసికంలో 38,266 యూనిట్లకు పరిమితం అయ్యాయి. పుణెలో ఐదు శాతం పడిపోయి 23,112 యూనిట్ల నుంచి 21,925 యూనిట్లకు చేరుకున్నాయి.

First Published:  12 July 2024 7:19 AM GMT
Next Story