Gold Rates | ఏడాది చివరికల్లా ఔన్స్ బంగారం 2700 డాలర్లు.. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలే కారణమా..?!
Gold Rates | వచ్చే జూన్ నుంచి కీలక వడ్డీరేట్లు తగ్గిస్తామని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ స్పష్టమైన సంకేతాలివ్వడంతో డాలర్, యూఎస్ ట్రెజరీ బాండ్లకు గిరాకీ తగ్గిపోగా, ఇన్వెస్టర్లు బంగారంపై తమ పెట్టుబడులను మళ్లించారు.
Gold Rates | వచ్చే జూన్ నుంచి కీలక వడ్డీరేట్లు తగ్గిస్తామని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ స్పష్టమైన సంకేతాలివ్వడంతో డాలర్, యూఎస్ ట్రెజరీ బాండ్లకు గిరాకీ తగ్గిపోగా, ఇన్వెస్టర్లు బంగారంపై తమ పెట్టుబడులను మళ్లించారు. ఫలితంగా గత ఫిబ్రవరి నుంచి బంగారం ధరలు ధగధగ మెరుస్తూనే ఉన్నాయి.
ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా యుద్ధంతోపాటు మధ్యప్రాచ్యంలో హమాస్-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల్లో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇరాన్ రణన్నినాదం చేసింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్ దాడులతో అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితికి దారి తీసే సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఈ ఏడాది చివరికల్లా ఔన్స్ బంగారం 2700 డాలర్ల గరిష్ట స్థాయిని తాకుతుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మ్యాన్ సాచెస్ అంచనా వేసింది.
ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర శుక్రవారం 2400 డాలర్లతో జీవిత కాల గరిష్టాన్ని తాకింది. హైదరాబాద్‌లో 24 క్యారట్ల బంగారం తులం ధర ఇప్పటికే రూ.75 వేల మార్కునుదాటేసింది. గత నాలుగు వారాలుగా పసిడి ధర నిత్యం పెరుగుతూనే ఉంది. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్ తమ పెట్టుబడులకు బంగారం స్వర్గధామంగా పరిగణించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
గతవారం వెలువడిన యూఎస్ రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలతో మదుపర్ల సెంటిమెంట్ బలహీన పడింది. ఫలితంగా వడ్డీరేట్ల తగ్గింపు ఆశలు అడియాసలయ్యే అవకాశం ఉందని భావించిన ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. గత రెండు నెలల్లోనే బంగారం ధర 20 శాతం పెరిగింది.
సంప్రదాయంగా వడ్డీరేట్లు, వృద్ధి అంచనాలను బట్టి బంగారం విలువ ఖరారవుతుంది. ఈ కారణాలేవీ తాజా బంగారం ధరల పెరుగుదలకు కారణం కాదు. నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ద్రవ్య లభ్యత ముప్పు నుంచి తప్పించుకునేందుకు యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గిస్తే ఈటీఎఫ్‌లకు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. బంగారం ధర మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎవర్‌బ్యాంక్ వరల్డ్ మార్కెట్స్ ప్రెసిడెంట్ చిరిస్ గాఫ్నేయ్ మాట్లాడుతూ మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలతో బంగారం ధర మరింత మెరుస్తుందని అంచనా వేశారు. ప్రస్తుత ధరల ఆధారంగా ఈ ఏడాది చివరికల్లా ఔన్స్ బంగారం ధర 2300 డాలర్ల నుంచి 2700 డాలర్లకు చేరుతుందన్నారు.